‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి

Mar 13,2024 21:38

ప్రజాశక్తి – కురుపాం : ఉపాధి హామీ పనులు చేసి పెండింగిలో ఉన్న కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, గిరిజన సంఘం సీనియర్‌ నాయకులు ఎం.తిరుపతిరావు అధికారులను కోరారు. మండలంలో దురిబిలి గిరిజన గ్రామంలో బుధవారం పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజనులు గతేడాది నుండి చేస్తున్న ఉపాధి పనులకు సక్రమంగా బిల్లులు రాలేదని తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. గతేడాది రెండు గ్రూపుల్లో 32 మంది సభ్యులు భూ అభివృద్ధి పథకంలో ఉపాధి పని చేస్తే ఇంతవరకు బిల్లులు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి కారణమని అన్నారు. అలాగే ఈ ఏడాదిలో పని చేసిన గత ఐదు వారాల నుంచి ఉపాధి పనులకు వెళ్లి పనులు చేస్తున్నప్పటికీ ఒక్క వారం కూడా బిల్లు కాలేదని గిరిజనులు చెప్పారని అన్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో కరువు బారిన పడి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో జీడి, చింతపండు పంట రాక, వరి పంట పండక గిరిజనులు వలస వెళ్లిపోతునా ్నరని, వలసలు నివారించడానికి ప్రభు త్వం పెట్టిన ఉపాధి చట్టం సక్రమంగా జరగడం లేదని అన్నారు. దీంతో కురుపాం నియోజకవర్గంలో గిరిజనులు ఇతర జిల్లాలకు పెసర, మినప చేలుతీతలకు తాత్కాలిక వలసలు వెళ్తున్నారని వెంటనే జిల్లా ఉపాధి హామీ పిడి స్పందించి గిరిజన ప్రాంతం లో అందరికీ ఉపాధి పనులు కల్పించి, బకాయిలు వెంటనే చెల్లించి వలసలు నివారించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.

➡️