ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ..

Apr 2,2024 22:14

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో గత రెండు నెలలుగా టిడిపి నుంచి వైసిపికి, వైసిపి నుంచి టిడిపిలోకి జరుగుతున్న చేరికల రాజకీయాలను చూసి జనం చీదరించుకుంటున్నారు. ఊసరవెల్లి కంటే స్పీడుగా రంగు మార్చేస్తున్న నాయకులు తీరును చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని ఈ జంపింగ్‌ జపాంగ్‌ల తీరును చూసి అసహించుకుంటున్నారు. ఎన్నికల ముందు రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమైనప్పటికీ పార్వతీపురంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు మాత్రం ప్రత్యేకం. పట్టణంలోని ఒకటో వార్డు స్వతంత్ర కౌన్సిలర్‌ మూడేళ్లలో వైసిపి, బిజెపి, టిడిపి పార్టీల్లో ఆయా అధినేతల సమక్షంలో కండువాలు కప్పకున్నారు. విశేషమేమిటింటే ఒక్కో పార్టీలో ఆయన రెండేసి సార్లు చేరారు. అలాగే సీతానగరం మండలం నిడగల్లుకు చెందిన కొంతమంది ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో జనసేన నుంచి వైసిపిలోకి చేరారు. ఆ మరుసటి రోజే అదే వ్యక్తులు తాము వైసిపిలోకి చేరలేదని, సమస్యలు చెప్పుకోడానికి వెళ్తే ఆ కండువాలు కప్పేశారని ప్రకటించారు. అదే మండలం రామవరంకు చెందింన కొంతమంది టిడిపి నియోజకవర్గ ఇన్చార్జీ బోనెల విజయచంద్ర సమక్షంలో టిడిపిలోకి చేరగా, కొద్దిరోజులకే వారిలో కొద్దిమంది తాము అలజంగి జోగారావు వెంటే ఉన్నామని ప్రకటించడం విశేషం. ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడుగా పేరు పొందిన సీతానగరం మండలానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు ఆయనతో విభేదించి చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి చేరి కొద్ది రోజుల వరకు టిడిపిలో ప్రముఖపాత్ర వహించారు. అంతేకాకుండా చిన అంకలాంలో టిడిపిలోకి చేరికలను పెద్దఎత్తున ప్రోత్సహించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో కొద్దిరోజుల క్రితం వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించి, ఇప్పుడు ఎమ్మెల్యే పక్కన నిత్యం దర్శనమిస్తున్నారు. ఆయన మాట విని టిడిపిలోకి వచ్చిన వారు ఆ నాయకుని తీరు చూసి నిర్ఘాంతపోతున్నారు. అలాగే పార్వతీపురం పట్టణంలోని 25వ వార్డు మాజీ కౌన్సిలర్‌ భర్త గంట శ్రీనివాసరావు కొద్దిరోజుల క్రింతం వైసిపి కండువా కప్పుకున్నారు. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ టిడిపి కార్యాలయంలో పచ్చకండువా కప్పుకున్నారు. ఈ వికృత క్రీడ పార్వతీపురం పట్టణంతో పాటు, బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలాలలో సర్వ సాధారణమైపోయింది. నచ్చిన పార్టీలో చేరి ఆపార్టీకి సేవలందించడంలో ఏమాత్రం తప్పులేకపోయినా ఇంత స్పీడ్‌గా పార్టీలను మార్చడం పట్ల జనం ఎవగించుకుంటున్నారు. ఒక నాయకుడిని గానీ, కార్యకర్తను గానీ పార్టీలో చేర్చుకున్నారంటే, సదరు వ్యక్తి తన వెనుకనున్న వారిని ప్రభావితం చేసింది ఓటురూపంలో మార్చి, తమకు ఎంతో కొంత మేలు చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి నాయకులు ఆహ్వానించడం సహజం. కానీ ఊసరవెల్లుల కంటే వేగంగా రంగులు మార్చే ఇటువంటి నాయకులు పార్టీలు మారుతున్నారంటే ఎవరూ నమ్మరు. ఇలాంటి వారు ఇతరులపై ఏమేరకు, ప్రభావం చూపిస్తారు. వీరి మాటాలను ఏమేరకు విశ్వసించి ఓట్లు వేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు రాజకీయ నాయకులు మానుకుని తనతో ఉన్న పాత వారినే నమ్ముకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లడం మంచిదని, తనను గెలిపిస్తే అంకితభావంతో పనిచేసే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. ఇలా ఊసరివిల్లాలా రంగులు మార్చే సంద్రాయానికి వెంటనే చెక్‌ పెట్టాలని, ఇరు పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు కోరుతున్నారు.

➡️