ఎండుగడ్డికి గడ్డు కాలం

పజాశక్తి-రామసముద్రం మండలంలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. కనీసం పశువులకు పచ్చిమేత అందించలేక పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి పశుపోశన అందకపోవడంతో పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. వేసవి ముదిరే కొద్దీ కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. వేసవికాలంలో పాడిరైతులు పశుగ్రాసానికి అవస్థలు తప్పడం లేదు. పాడి పరిశ్రమకు కష్టకా లం నడుస్తోంది. గ్రాసం కరువై తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పాడికి పచ్చి మేత ప్రధానం. తీవ్ర ఎండ పరిస్థితులతో పచ్చిమేతకు డిమాండ్‌ పెరిగింది. వేసవి ఆరంభంలోనే పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. వెంటాడుతున్న వేసవి తాపంతో పశుగ్రాసం, నీటికొరతలు పశువులకు జీవన్మరణ సమస్యగా మారింది.మండల ప్రాంతంలో ఈ సమస్య అధికంగా ఉంది.గతంలో కురిసిన వర్షాలు కొన్నాళ్ళు మాత్రమే ఊరటనిచ్చింది. ఏడాదికేడాది పశుగ్రాసం కొరత తీవ్రమైంది. పైగా ఈ ఏడాది కొన్ని చోట్ల గడ్డి దొరికే పరిస్థితిలేదు. చేసేదిలేక పశువులను రైతులు వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. వేలాది కుటుంబాలకు జీవనోపాధి చూపుతున్న పాడిపరిశ్రమకు విఘాతం కలగడంతో దానిపైన ఆధారపడిన మిగతావారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలో కొన్ని చోట్ల పశువులకు పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చింది. పశుపోషకులు ఇబ్బం దులు పడుతున్నారు. పశువులను మేపలేని పరిస్థితి తలెత్తడంతో రైతులు వాటిని తెగనమ్ముకునే దుస్థితి దాపురించింది. రూ.70 వేల విలువైన అవును రూ.30 వేల అమ్ముతున్నారంటే పాడిపరిశ్రమ ఎంత సంక్షోభంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పొలాల్లోని తాగునీటి కుంటల్లో చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. పొలాల్లో ఉండే పశువులను సైతం నీళ్లకోసం ఇంటికి తోలుకొస్తున్నారు. మూగజీవాలకు మేతకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించి వరిగడ్డి కొనుగోలు చేసి మండలానికి దిగుమతులు చేస్తున్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల మేత పెంపకానికి కార్యక్రమాలు చేస్తున్న క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పశు సంవర్ధక శాఖ పంపిణీ చేస్తున్న పశుగ్రాసం, విత్తనాపంపిణీ మొక్కుబడిగా మారింది. కనీసం ఎండుగడ్డి దొరక్క లక్షలు విలువ చేసే పశువులను తక్కువ ధరలకు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి సంతలో విక్రయిస్తున్నారు. ఉపాధి, వాటర్‌షెడ్‌ పథకాల్లో భాగంగా పశుగ్రాసాన్ని పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులకు సంబంధిత శాఖ సిబ్బంది నుంచి ప్రోత్సాహం కరువైంది. కొంతమంది రైతులే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. పాడిరైతులకు ముందస్తు సమాచారం లేక ఉచిత విత్తనాలు అందలేదు. ఉపాధిహామీ పథకంలో పశుగ్రాసం పెంపకానికి చేపట్టిన కార్యక్రమం నివేదికలకే పరిమితమైంది. సమాచార లోపంతో రైతులకు ఉచిత విత్తనాలు కరువయ్యాయి. ఇప్పటికే మండలవ్యాప్తంగా పశుసందపద తగ్గుముఖం పడుతోంది. ఇటు పశుగ్రాసం కొరత అన్నదాతను కలవరపెడుతోంది. ఎడ్లబండిలోడ్‌ వరి గ్రాసానికి రూ.వెయ్యికి పైగా, ట్రాక్టర్‌ వరి గ్రాసాన్ని రూ.10 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో పశు సంపదను కాపాడుకునేందుకు రైతులు నానాకష్టాలు పడుతున్నారు. పశువులను పోషిస్తున్న రైతులు గ్రాసం కోసం కొందరు రైతులు మాత్రమే అధిక ధరలు వెచ్చించి పశు సంపదను కాపాడుకుంటున్నారు.మొక్కుబడిగా విత్తనాల పంపిణీ ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంపిణీ చేసే గ్రాసం విత్తనాలు మొక్కుబడిగా అందిస్తున్నారు. గడ్డి లేక తక్కువ ధరకు పశువులు అమ్ముతున్నాం వేసవికాలం కరువు పరిస్థితులతో తక్కువ ధరలకు పశువులను విక్రయిస్తున్నాం. వేలకు వేలు డబ్బులు ఖర్చులు పెట్టినా గ్రాసం మార్కెట్లో దొరకడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్నా రాయితీలు అందడం లేదు చివరికీ పశుసంపద అంతరించి పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఏంచేయాలో అర్థం కావడం లేదు.- ప్రసాద్‌, రైతు, బైరాజుపల్లి.నానాతిప్పలు పడుతున్నాం మూగజీవాలకు పశుగ్రాసం అందించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయల డబ్బులు పెట్టి వరిగడ్డి దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. దీంతోఆర్థికంగా ఇబ్బందులుపడుతున్నాం. మా సమస్యపై అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి దాణా సబ్సిడీపై అందించడానికి చర్యలు చేపట్టాలి. – శ్రీనివాసులు, రైతు, నారేవారిపల్లి.

➡️