ఎంత బెదిరించినా తగ్గం

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో సమ్మె ప్రారంభించిన నెల రోజులు అయిన సందర్భంగా అంగన్‌వాడీలు 30 సంఖ్య ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపోరు నాయకులు కోటేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. మూడవ రోజు రిలే నిరాహార దీక్షల్లో టి.రాధా, కె.శివకుమారి, ఎ.పద్మావతి, బసవపున్నమ్మ, సిహెచ్‌.జ్యోతి, ఎ.భార్గవి, జె.నాగలక్ష్మి కూర్చున్నారు. నేతాజి మాట్లాడుతూ చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై సమస్యలు పరిష్కరించకుండా, మొదటి నుండి తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోందన్నారు. అప్రజాస్వామిక చర్యలను ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ తదితరాల ధరలు భారీగా పెరిగినందున వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సమ్మె శిబిరం కొనసాగింది. రిలేదీక్షలను శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి ప్రారంభించారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి మాట్లాడుతూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వం తాజాగా సూపర్‌వైజర్ల ద్వారా షోకాజ్‌ నోటీసులను కార్యకర్తల ఇళ్లకు అంటిస్తున్నారని, ఎన్ని బెదిరింపులకు భయపడబోమని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాడతామని చెప్పారు. జాబ్‌ చార్ట్‌లో లేని అనేక సేవలను అందిస్తున్న అంగన్వాడీలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వారికి కనీస వేతనం, ఉద్యో భద్రత ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సమ్మెకు నరసరావుపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మెదరమెట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని, ధైర్యంగా పోరాడాలని చెప్పారు. అంగన్వాడీల కోసం న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కె.రాధిక, డి.ఉదయశ్రీ, ఎం.హరీష్‌కుమార్‌, బి.సలీం, కె.ఎస్‌.ఆర్‌.ఎ ఆంజనేయులు పాల్గొన్నారు.
ఇళ్లకు షోకాజులు అంటిస్తున్నారు.. అయినా తగ్గం..యు
.పద్మ, జి.మాధవి, కరీమూన్‌బిఅంగన్వాడీ కార్యకర్తలు, నరసరావుపేట ప్రాజెక్టు.
ఎస్మాను ప్రయోగించినా వెనకడుగేయం.. ఉద్యోగ భద్రత కల్పనతోపాటు వేతనాలపై హామీలను అమలు చేసే వరకూ పోరాడతాం. మేం సమ్మె చేస్తుంటే సూపర్‌వైజర్‌, ఇతర అధికారుల ద్వారా షోకాజు నోటీసులను ఇళ్లకు అంటించారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలు చేస్తున్న మేము ప్రతిఫలం అడుగుతుంటే బెదిరిస్తున్నారు. ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహార శైలి ఉంటే సమ్మెను ఉధృతం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో మా కుటుంబాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాయి.

➡️