ఎందుకంత ఉదాసీనత?

Jan 5,2024 21:50

ప్రజాశక్తి-వేపాడ :  ఆయనో మండల స్థాయి అధికారి. చేయని పనిని చేసినట్లు చూపించడంలో, ఉన్నతాధికారులను ‘మేనేజ్‌’ చేయడంలో దిట్ట. అందుకే ఆయన ఎన్ని తప్పులు చేసినా, కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పైగా ఆ అధికారికి వంత పాడుతుంటారు. కలెక్టర్‌ సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా, మసిపూసి మారేడు కాయ చేసి ఆయన్ను కాపాడుకుంటూ వస్తున్నారు. పైపెచ్చు ప్రజాప్రతినిధులకు భజన చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. స్వామిభక్తి చూపిస్తుండటంతో ఆయన ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని లోపాలున్నా ఏమీ అనడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన మండలంలో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిగో.. ఈ చిత్రాన్ని చూశారా! వేపాడ మండల కేంద్రం సమీపంలోని బక్కునాయుడుపేట వద్దనున్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బాలికల గురుకుల ఆవరణమిది. సుమారు ఐదు ఎకరాలకు పైగా ఉన్నా ఆ ఆవరణమంతా ఆర్నెల్ల క్రితం ఇలా దట్టమైన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, బండరాళ్లతో భయంకరంగా ఉండేది. విద్యార్థినులు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయే వారు. విద్యార్థుల బాధలు విన్న ఓ సామాజిక కార్యకర్త, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో వేపాడ మండల స్థాయి కీలక అధికారి.. పది మంది కూలీలను పెట్టి, గంట గంటలపాటు పనిచేయించి, ఐదు ఎకరాలకు పైగా ఉన్న మైదానం బాగుచేసినట్లు నివేదిక పంపించారు. తీరా చూస్తే.., ఎక్కడి తుప్పలు, డొంకలు, ముళ్లపొదలు అక్కడే ఉన్నాయి. ఆ మండల స్థాయి అధికారి తప్పుడు నివేదిక పంపినట్లు రుజువై నెలలు గడుస్తున్నా నేటికీ చర్యలు తీసుకోలేదు. అధికారులు ఎలాగూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు కూడా తమకేమీ సంబంధం లేదన్నట్లు వదిలేశారు. గురుకులం ఆవరణలో పాములు, విషకీటకాల సంచారంతో విద్యార్థినులు సతమతం అయ్యేవారు. దీంతో అదే సామాజిక కార్యకర్త దాతల సాయంతో ఆ మైదానాన్ని చదును చేయించారు. దాతల సాయంతో చేసిన పనులకు, అదే అధికారి అంచనాలు రూపొందించి వేసి, ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. దాతలు చేసిన పనులకు అంచనాలు వేయడం, ఆమోదం కోసం పంపించడం నేరమని తెలిసినా, ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమానో, మరేమో తెలియదు గానీ దానికీ తెగించారు. బిల్లులు మంజూరు చేయించుకుని, తన జేబు నింపుకోవాలన్న ఆలోచనతోనే ఆ అధికారి అలా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఎందుకు వెనుకాడుతున్నారో?గురుకులంలో సమస్యలపైనా సామాజిక కార్యకర్త, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిరసనలు కూడా చేపట్టారు. మరోవైపు మండల స్థాయి అధికారి చేసిన తప్పిదాలపై ఆధారాలతో సహా స్పందన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త.. కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలు ఆ అధికారికి కంటగింపుగా మారాయి. అందుకే సామాజిక కార్యకర్తను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుని ప్రజాప్రతినిధులను, నాయకులను, పలువురు ఉద్యోగులను ఆయనపై ఉసిగొల్పుతున్నారు. ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తూ, తప్పుడు నివేదిక అందజేసిన అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా ఆయన్ను వెనుకేసుకొస్తున్నారు. చర్యలకూ వెనుకడుగేస్తున్నారు. విద్యార్థినుల బాగోగుల కోసం పరితపించిన సామాజిక కార్యకర్తను వేధింపులకు గురిచేస్తున్నారు.కలెక్టర్‌ స్పందించేనా?జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పేద విద్యార్థినులు గురుకులంలో విద్యనభ్యశిస్తున్నారు. ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని సిఎం మొదలుకొని మండల స్థాయిలో ప్రజాప్రతినిధి వరకు అందరూ తరచూ చెబుతుంటారు. ఏళ్ల తరబడి గురుకులంలో విద్యార్థులు ఆట స్థలం లేక, తుప్పులు డొంకలతో కూడిన ఆవరణంతో భయం భయంగా గడుపుతుంటే ఏ ఒక్కరూ చర్యలు తీసుకోలేదు. విద్యార్థినుల సమస్యలపై స్పందించిన సామాజిక కార్యకర్తపై, సాయం చేసిన దాతలపై అదే మండల స్థాయి కీలక అధికారి వేధింపులకు దిగడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం, కలెక్టర్‌ జోక్యం చేసుకుని గురుకులంలో సమస్యలను పరిష్కరించాలని, తప్పుడు నివేదిక పంపించి, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

➡️