ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తేయాలి

గుంటూరులో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : 146 మంది ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యులను అక్రమంగా సస్పెండ్‌ చేయడం దేశ చరిత్రలో మాయని మచ్చ అని వామపక్షాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు అన్నారు. ఎంపీల సస్పెన్షన్‌పై దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా శుక్రవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరులోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, విసికె, జనతాదళ్‌ తదితర పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పాశం రామారావు, జంగాల అజరుకుమార్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌కె.మస్తాన్‌వలి, విసికె పార్టీ నాయకులు జయసుధ, జనతాదళ్‌(యు) జిల్లా అధ్యక్షులు ఎన్‌.సాంబశివరావు మాట్లాడుతూ పార్లమెంట్‌పై జరిగిన దాడిని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్‌ నుండి అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చర్యను దేశ ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ వారిని హెచ్చరించడానికి భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ పార్లమెంట్‌లో పొగబాంబువేసి ప్రజల్లో ధైర్యం నింపారన్నారు. నేడు స్వతంత్ర భారత దేశంలో బిజెపి పార్లమెంట్‌ సభ్యుని పాస్‌లతో పార్లమెంట్‌లోకి ప్రవేశించి దాడిచేయడం, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాసామ్యానికి మాయని మచ్చని, ఈ చర్య దేశ రక్షణకు, దేశ భద్రతకు ముప్పుని అన్నారు. దీనిపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం పార్లమెంట్‌ సభ్యులనే సస్పెండ్‌ చేసిందని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై జరుగుతున్న ఆందోళనలను, ప్రజల ఆలోచనలను దారిమళ్లించటానికే ఇలాంటి చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతోందని విమర్శించారు. పార్లమెంట్‌ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరుతుగా క్షమాపణలు చెప్పి, సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఎల్‌.ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్‌, ఉడా మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, నాయకులు ఎమ్‌.ఎ.చిష్టీ, కె.నాగేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్‌ వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆ పార్టీ మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి, సిపిఐ ఏరియా కార్యదర్శి ముసునూరు సుహాస్‌ మాట్లాడారు. సిపిఎం నాయకులు ఎ.రంగారావు, కె.శివన్నారాయణ, ఎ.రామారావు, కె.జేమ్స్‌, కె.బాబు, రవి పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చందు సాంబశివుడు, సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబుప్రసాద్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు షేక్‌ హుస్సేన్‌వలి, కాంగ్రెస్‌ నాయకులు బుల్లయ్య పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన తెలపగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ పార్లమెంటులో ఘటనపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి చర్చించాలని, ప్రధాని, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేగాని ప్రశ్నించిన ఎంపీల సస్పెన్షన్‌ సరికాదన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏపూరి గోపాలరావు, డి.శివకుమారి, జి.పిచ్చారావు, ఇ.లక్ష్మారెడ్డి, కె.రామారావు, ప్రజా సంఘాల నాయకులు రెడ్‌ బాషా, ఎన్‌.రామారావు, కోటా నాయక్‌ పాల్గొన్నారు. పిడుగురాళ్లలో బంగ్ళా సెంటర్‌ నుండి ఐల్యాండ్‌ సెంటర్‌ వరకూ వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, భారత్‌ బచావో, పీడీఎం, ఎంఆర్‌పిఎస్‌, ఐద్వా నాయకులు టి.శ్రీనివాసరావు, జై కృష్ణనాయక్‌, కె.శ్రీనివాసరావు, ఎస్కే సర్దార్‌, ఎలమందరెడ్డి, లక్ష్మణరావు శ్రీనివాసరాజు, పి.సుజాత, సరస్వతి బాయి, లక్ష్మి, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, నాగిరెడ్డి, బి.నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, హైదరాలి, సిరి, డి.భూలక్ష్మి పాల్గొన్నారు.

➡️