ఎంపీ అభ్యర్థులు కావలెను..!

ఎంపీ అభ్యర్థులు కావలెను..!

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం బరిలో నిలిచేదెవరనే సందిగ్ధత నెలకొంది. అధికార వైసిపి అసెంబ్లీ సమన్వయకర్తల పేర్లను ప్రకటించిన విషయం విదితమే. పార్లమెంటు అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. మరోవైపు టిడిపి, జనసేన కూటమిలో ఏ పార్టీకి ఎంపీ స్థానం కేటాయిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆ పార్టీకి సైతం స్థానికంగా బలమైన అభ్యర్థులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో వైవిధ్యమైన ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో తొలి ఎంపీగా కమ్యూనిస్టు పార్టీ తరుపున కానేటి మోహనరావు, సోషలిస్టు పార్టీ తరుపున నల్లారెడ్డి నాయుడు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మూడుసార్లు, బిజెపి ఒకసారి, టిడిపి మూడుసార్లు ఈ స్థానాన్ని కైవశం చేసుకున్నాయి. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంతో పాటు మరో ఆరు నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్‌ స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా, సామాజికంగా బలాబలాలను పరిశీలించి అభ్యర్థులను బరిలో నింపేందుకు వైసిపి, టిడిపిలు కసరత్తు చేస్తున్నాయి. 2019లో పార్లమెంటు స్థానంలో గెలుపొందిన మార్గాని భరత్‌రామ్‌ రానున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్‌ఎగా బరిలో నిలువనున్నారు. 2014లో టిడిపి నుంచి ఎంపీగా గెలుపొందిన మాగంటి మురళీమోహన్‌ దాదాపుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ రెండు పార్టీల్లో ఎంపీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు టిడిపి, జనసేన పొత్తులో భాగంగా స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ పార్టీ నేత సోము వీర్రాజు తాను ఎంపీ లేదా అసెంబ్లీ స్థానానికి రాజమహేంద్రవరం నుంచే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికీ బిజెపితో అలయన్స్‌లో ఉన్న విషయం విదితమే. బిజెపి నాయకులు సైతం పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ స్థానం ఆ మూడుపార్టీలో ఎవరికి సొంతం అవుతుందో వేచి చూడాలి. వైసిపి తరుపున పార్లమెంటు అభ్యర్థిగా సినీ దర్శకులు వివి.వినాయక్‌ పోటీ చేస్తారనే ప్రచారం తాజాగా ఊపందుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని రోజులుగా వైసిపి నగర అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ గూడూరు శ్రీనివాస్‌, లేదా మాజీ కార్పొరేటర్‌ డాక్టర్‌ అనసూరి పద్మలత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదింపుతూ అధినేత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సినీ దర్శకులు వివి వినాయక్‌ జిల్లాలోని చాగల్లు మండలానికి చెందిన వారు కావడంతో పాటు స్థానికులతో అనుబంధం ఉంది. మరోవైపు సినీ చరిష్మా కలిసి వస్తాయనే ఆశాభావం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఒక వైపు మాజీ కార్పొరేటర్‌ అనసూరి పద్మలత కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. టిడిపి, జనసేన కూటమిలో టిడిపికి కేటాయిస్తే మాజీ ఎంఎల్‌సి కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. టిడిపి నుంచి రూరల్‌ ఎంఎల్‌ఎ బుచ్చయ్య చౌదరి కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లోనూ ఆయా కేడర్లలోనూ ఉత్కంఠ నెలకొంది.

➡️