ఎఎంసి అభివృద్ధికి కృషి : చైర్‌పర్సన్‌

Feb 21,2024 21:01

 ప్రజాశక్తి – పూసపాటిరేగ  : పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దామని చైర్‌పర్సన్‌ చిక్కాల అరుణకుమారి అన్నారు. బుధవారం స్థానిక మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్మన్‌గా ఆమె ఎన్నికైన తరువాత మొదటి సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా డెరెక్టర్‌లు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి సతీష్‌ మార్కెట్‌ కమిటీ ఆదాయ, వ్యయాలను డెరెక్టర్‌లకు వివరించారు. ఈ ఏడాది 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ. 1.61 కోట్లు కాగా ఇప్పటి వరకూ రూ. 1.30కోట్లు వరకూ పూర్తియ్యిందన్నారు. 2024-25 సంబందించి లక్ష్యం రూ.1.65 కోట్లు అని చెప్పారు. మార్కెట్‌ కమిటీకి సంబంధించి నెల్లిమర్ల , మోదవలసలోని గోడౌన్‌లను రిపేరు చేసి వినియోగంలోకి తేవాలని, భోగాపురంలో మార్కెట్‌ పనులు ప్రారంభించాలని తీర్మానం చేసారు. ఈ సందర్బంగా చైర్మన్‌ అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం గోదాములన్నింటినీ వినియోగంలోకి తేవాలని అన్నారు. మార్కెట్‌ కమిటీ పరిధిలో ఎంతమందికి లైసెన్స్‌ వ్యాపారాలు ఉన్నాయో, ఎంత మందికి ఇంకా లైసెన్స్‌లు ఇవ్వాలో వివరాలు సేకరించాలని కార్యదర్శికి సూచించారు. మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు సహకారం అందించే కార్యక్రమాలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ భర్త చిక్కాల సాంబ, స్థానిక సర్పంచి టొంపల సీతారాం, డైరెక్టర్‌లు గొంప సన్యాసిరావు, దారపు అప్పలసూరిరెడ్డి, రోశయ్య, దేవుళ్లు, పి.నారాయణమూర్తి, సూపర్‌వైజర్‌ చిన్నమ్మలు, సిబ్బంది అంజిబాబు పాల్గొన్నారు.

➡️