‘ఎడిఎఫ్‌’ ద్వారా అభివృద్ధి పనులు

Feb 14,2024 22:24
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
‘ఎడిఎఫ్‌’ ద్వారా అభివృద్ధి పనులు
ప్రజాశక్తి-అనంతసాగరం : ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం (ఎడిఎఫ్‌) ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలో బుధవారం జెడ్‌పి చైర్‌పర్సన్‌ ఆనం.అరుణమ్మ, ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అనంతసాగరంలో నిర్వహించిన విజయీభవ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎడిఎఫ్‌ సౌజన్యంతో పలువురు దాతలు చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు ప్రభుత్వ భవన సముదాయాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతసాగరంలో రూ.20లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవన ప్రారంభోత్సవాన్న నిర్వహించారు. మాజీ జెడ్‌పిటిసి బుట్టి వెంకటకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు రూ.15లక్షల నిధులతో ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం నేతృత్వంలో నిర్మించిన పంచాయతీ బస్టాండ్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పి.రాందాస్‌ దాతృత్వంతో ఎడిఎఫ్‌ నేతృత్వంలో రూ.2.50లక్షల నిధులతో నిర్మించిన 108 అంబులెన్స్‌ ఉద్యోగుల వసతి గృహ భవనం నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభోత్సావన్ని నిర్వహించారు. రూ.35లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.37.50 లక్షలతో నిర్మించిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి జిల్లా ప్రజపరిషత్‌ అతిథి గృహ ప్రారంభోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ అనంతసాగరం పంచాయతీకి ఇప్పటి వరకు మన ప్రభుత్వంలో రూ.37.34 కోట్ల నిధులను సంక్షేమాభివృద్ధి కోసం అందజేసినట్లు వివరించారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.80లక్షలతో అభివృద్ధి పనలు నిర్వహించామని, రూ.15లక్షలతో బోర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా 2.35 కోట్లు, ఎంపి నిధులు రూ.4లక్షల ద్వారా అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు దేవాలయాల పునర్మిరాణం కోసం రూ.20లక్షలు అందజేశామన్నారు. జిల్లా కలెక్టర్‌తో జరిపిన సమీక్షలతో అనంతసాగరం మండలంలో దాదాపు 367మంది రైతులకు లబ్ధి చేకూరిందని వివరించారు. నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం ద్వారా ఇప్పటి వరకు రూ.22.5లక్షల నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. పార్టీలకు అతీతంగా మన ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలందరినీ కలుపుకుని అభివృద్ధిని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఎంపిపి సంపూర్ణమ్మ, సర్పంచ్‌ శోభ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️