ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి : సిపిఎం

Jan 31,2024 00:28

మాట్లాడుతున్న బాబూరావు
ప్రజాశక్తి-గుంటూరు :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి, మాట తప్పిన బిజెపిని రాబొయే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.భావన్నారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీ విస్తృత సమావేశం మంగళవారం జరిగింది. బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పోరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, రాజ్యాంగంలోని లౌకిక విలువలకు తిలోదకాలిస్తోందని మండిపడ్డారు. ఈ స్థితిలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన బిజెపి విధానాలను వ్యతిరేకించకుండా అంటకాగుతున్నాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలపై నిర్బంధం ప్రయోగిస్తోందన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష కార్మికులకు వారి ఆందోళన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చేనెల 16న కార్మిక, రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సమావేశంలో తీర్మానించారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు వై.నేతాజి, కె.నళినీకాంత్‌, ఇ.అప్పారావు, ఎస్‌ఎస్‌.చెంగయ్య, ఎం.రవి, ఎమ్‌.ఎ.చిష్టీ, బి.వెంకటేశ్వరరావు, డి.వెంకటరెడ్డి, బి.కొటేశ్వరి, ఎల్‌.అరుణ పాల్గొన్నారు.

➡️