ఎన్నికల్లో వాలంటీర్లు చొరవచూపాలి : ఎమ్మెల్యే బొత్స

Feb 22,2024 19:47

 ప్రజాశక్తి-గంట్యాడ  : వాలంటీర్లు వారికి కేటాయించి 50 కుటుంబాలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించి, రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. గురువారం కొండతామరపల్లి జంక్షన్‌లోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ ఉండడం వలన పరిపాలనను సులువుగా సాగించగలుగుతున్నామని అన్నారు. దళారీ దోపిడీ వ్యవస్థ లేకుండా పథకాలను పేదలకు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మెల్యేలను, ఎంపిపిలను, జెడ్‌పిటిసిలను గుర్తించకపోయినా వాలంటీర్లను గుర్తించి అవార్డులు ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. వాలంటీర్లంతా రాబోయే కాలంలో ప్రజలను చైతన్యవంతులు చేసి వైసిపి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి పి. సురేష్‌ బాబు, ఎంపిపి పీరుబండి హైమావతి, జెడ్‌పిటిసి సభ్యులు వర్రి నర్సింహమూర్తి, ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షులు పీరుబండి జైహింద్‌ కుమార్‌, తహశీల్దార్‌ నీలకంఠేశ్వర్‌ రెడ్డి, ఎంపిడిఒ భవాని, వైసిపి మండల అధ్యక్షులు రంది రామనాయుడు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

➡️