ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి

Mar 18,2024 00:12

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
సాధారణ ఎన్నిల షెడ్యుల్‌ శనివారం జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.ఈ కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలక్టరేట్‌ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, డిఆర్‌ఒ పెద్దిరోజా పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఫొటోలతో కూడిన ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రకాల వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హౌర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్ని తొలగించి ఆదివారం సాయంత్రానికి కలెక్టర్‌ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలన్నారు.టెలీ కాన్ఫరెన్స్‌ అనంతరం కలక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పరిశీలించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలుఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో విధుల్లో లేని సూపరిండెంట్‌ పద్మకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని మేనేజర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ వచ్చినందున ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి రాజకీయ పార్టీల ర్యాలీల్లో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ఎక్కడైనా పాల్గొన్నట్లు నిరూపణైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో వార్డు సచివాలయాల్లో ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుల ఫొటోలు, ప్రభుత్వ పథకాల సూచిక బోర్డులు, పోస్టర్స్‌, ఫ్లేక్సీలు పూర్తి స్థాయిలో తొలగించాలని నోడల్‌ అధికారులకు, అడ్మిన్‌ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నగరంలో ప్రభుత్వ భవనాలు, జంక్షన్‌లు, జిఎంసి స్థలాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లేక్సీలు, బ్యానర్లను యుద్ద ప్రాతిపదికన తొలగించారని చెప్పారు.
కోడ్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయొచ్చు :
గుంటూరు కమిషనర్‌సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి శనివారం నుండే అమలులో ఉన్నందున నగరంలో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగిస్తున్నామని, ఇంకా ఏమైనా ఎంసిసికి సంబందించి ఫిర్యాదులు ఉంటే జిఎంసిలో ఏర్పాటు చేసిన కంప్లైంట్‌ సెల్‌ 9849908391 నంబర్‌కు కాల్‌ చేయాలని లేదా వాట్సప్‌ చేయవచ్చని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై అన్ని రకాల వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హౌర్డింగులు, బ్యానర్లు, జెండాలను నగరపాలక సిబ్బంది తొలగిస్తున్నారని, బహిరంగ ప్రదేశాలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్‌ స్తంభాలు, మున్సిపల్‌ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్‌మెంట్లు, వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు అన్నింటినీ శనివారం నుండి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

➡️