ఎన్నికల నియమావళిపై డేగకన్ను

Mar 25,2024 21:09

ప్రజాశక్తి- బొబ్బిలి: ఎన్నికల నియమావళిపై ఎన్నికల అధికారులు డేగకన్ను వేశారు. నియమావళి పర్యవేక్షణకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగులు వేయగా, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు, గోడ పత్రికలను తొలగించారు. ఎన్నికల నియమావళిను ఉల్లంఘిస్తున్న రాజకీయ పార్టీలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఎన్నికల అధికారుల అనుమతి లేకుండా నిమ్మలపాడు, ఇతర గిరిజన గ్రామాల్లో ప్రచారం చేసిన వైసిపి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుపై ఎంసిసి నోడల్‌ అధికారి రవికుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.నియోజకవర్గంలో తొమ్మిది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిను పటిష్టంగా అమలు చేసేందుకు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ పటిష్ట చర్యలు చేపట్టింది. నియోజకవర్గంలో తొమ్మిది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీములను ఏర్పాటు చేశారు. తొమ్మిది టీములు షిఫ్ట్‌కు మూడు టీములు చొప్పున 24గంటలు ఎన్నికల నియమావళిను పర్యవేక్షణ చేస్తారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, ఇతర సామగ్రిని తరలించకుండా నివారించేందుకు మూడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారం, సభలు, ర్యాలీలలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనను పరిశీలించేందుకు ఒక వీడియో సర్వే లైన్స్‌ టీమ్‌, వీడియో వ్యూయింగ్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనను పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకునేందుకు మున్సిపాలిటీలో కమిషనర్‌ను ఎంసిసి నోడల్‌ అధికారిగా నియమించగా బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాల్లో కోడ్‌ ఉల్లంఘనను పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకునేందుకు ఎంపిడిఒలను ఎంసిసి నోడల్‌ అధికారులుగా నియమించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై ఫిర్యాదులను స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ కోడ్‌ ఉల్లంఘన జరిగిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 08944-255888కు ఫిిర్యాదు చేయవచ్చును.ఎన్నికల నియమావళి నిరంతర పర్యవేక్షణ ఎన్నికల నియమావళిను పర్యవేక్షణ చేసేందుకు ఆర్‌డిఒ కార్యాలయంలో రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయగా సోషల్‌ మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న కథనాలను ఉల్లంఘించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి అమలకు పటిష్ట చర్యలునియోజకవర్గంలో ఎన్నికల నియమావళిను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌ఒ ఎ.సాయిశ్రీ అన్నారు. ఎన్నికల కోడ్‌ ఎక్కడ ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిను పాటించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలింగ్‌ కేంద్రాలు పరిశీలనశృంగవరపుకోట: పట్టణంలోని బర్మా కాలని, శ్రీనివాస కాలని, రైల్వే కాలనిలలోని పోలింగ్‌ స్టేషన్లను సోమవారం తహశీల్దార్‌్‌ కిరణ్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత్‌, ర్యాంప్‌, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలని, పోలింగ్‌ సమయంలో ఎన్నికల సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిటి భరత్‌ కుమార్‌, విఆర్‌ఒ కన్నయ్య, విఆర్‌ఎ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలిరామభద్రపురం: పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని బొబ్బిలి రూరల్‌ సిఐ తిరుమలరావు ఆదేశించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్టు పక్కాగా అమలు చేయాలని సీ విజిల్‌లో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సహకరించాలని సూచించారు. ప్రతీ పౌరుడు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ మద్యం, నాటుసారా, నిషేధిత గుట్కా విక్రయాలపై నిఘా ముమ్మరం చేయాలన్నారు.

➡️