ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని, ఎక్కడా అధికారులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫిరెన్సు ద్వారా సాధారణ ఎన్నికల సన్నద్ధత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌) ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. విసి ముగిసిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విధి విధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల వారికి ఎపిక్‌ కార్డులను జనరేట్‌ చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ స్టేషన్ల వద్ద మౌలిక వసతులు కల్పనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. కార్యక్రమంలో బద్వేలు ఆర్‌డిఒ వెంకటరమణ, ఎన్‌ఐసి అధికారి విజరు కుమార్‌, కలెక్టరేట్‌ హెచ్‌ సెక్షన్‌ ఎన్నికల సూపరిడెంట్‌ ధనుంజయ, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి నియమితులైన నోడల్‌ అధికారులు కేటాయించిన విధులపై పూర్తి అవగాహన పెంచుకుని అవసరమైన ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లను పట్టిష్టంగా చేపట్టాలని కలక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని బోర్డ్‌ రూమ్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌లతో కలిసి రానున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇఆర్‌ఒలు, నోడల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్‌ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బందికి తగిన శిక్షణ అవసరమని, అందుకు సంబంధించి మాస్టర్‌ ట్రైనర్లతో ట్రైనింగ్‌ ప్రోగ్రాంలను నిర్వహించాలన్నారు.

➡️