ఎన్నికల బాండ్లు వివరాలు వెంటనే వెల్లడించాలి

Mar 11,2024 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎన్నికల బాండ్లు వివరాలు వెంటనే వెల్లడించాలని డిమాండ్‌చేస్తూ కోట జంక్షన్‌ వద్ద గల స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా వద్ద సిపిఎం ఆధ్వర్యాన సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ దేశంలో పెట్టుబడి దారుల నుంచి వేలకోట్ల రూపాయలను బాండ్లు రూపంలో బిజెపి తీసుకుని రాబోయే ఎన్నికలలో ప్రజలకు పంపిణీ చేసి లబ్ధిపొందేందుకు కుట్ర చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే ఎస్‌ బిఐ లో ఎన్నికల బాండ్ల వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లో లేకుండా చేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా రాజ్యాంగానికి విలువ ఇవ్వని బిజెపి ప్రభుత్వ తీరుని ప్రజలంతా ఖండిచాంలని కోరారు. ఎన్నికల బాండ్ల సేకరణ రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు, ఎవరికి ఇచ్చారు అనే అంశాలతో పూర్తి వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని స్టేట్‌బ్యాంకును ఆదేశించినా అమలు చేయలేదన్నారు. గడువు ముగిస్తున్నా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్లు వివరాలు ప్రకటించకుండా నాటకాలు ఆడుతున్నదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వకముందు ఈ వివరాలు వెల్లడిస్తే బిజెపికి కార్పొరేట్‌ కంపెనీల నుంచి ఎన్ని వేల కోట్లు అందాయో బట్టబయలు అవుతుందని అన్నారు. తక్షణమే ఎన్నికల బాండ్లు ప్రీజ్‌ చెయ్యాలనీ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఎన్నికల బాండ్లకు సంబంధించి వివరాలను ఎస్‌బిఐ అందజేసేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని .వెంటనే ఎన్నికల బాండ్లు వివరాలు ప్రకటించాలని డిమాండ్‌ చేసారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి. రమణ. సీఐటీయూ కార్యదర్శి యు ఎస్‌ రవికుమార్‌, త్రినాథ్‌, నాయకులు హరీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి : ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌బిఐ వెంటనే వెల్లడించాలని కోరుతూ స్టేట్‌బ్యాంకు కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. శంకర్రావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే ఎస్‌బిఐ వివరాలు వెల్లడించకపోవడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్‌. గోపాల్‌, ఎ.సురేష్‌, మణికుమార్‌, పి. అప్పారావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వంగర : ఎన్నికల బాండ్లు వివరాలును వెంటనే ఎస్‌ బి ఐ వెల్లడించాలని కోరుతూ రాజాంలోని ఎస్‌బిఐ బ్రాంచి వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకర్రావు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వంజరాపు తిరుపతి, పొరెడ్డి విశ్వనాథం, మడపాన త్రినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

గరివిడి : ఎలక్ట్రోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ఎస్‌బిఐ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెంటనే ఆ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిపిఎం నాయకులు ఎ.గౌరినాయుడు, జె.విశ్వనాధరాజు, సేనాపతి పాపినాయుడు, కరణం సన్యాసినాయుడు, తాళ్లపూడి సత్యం తదితరులు పాల్గొన్నారు.

➡️