ఎర్ర చందనం స్మగ్లర్ల ఘాతుకం

ప్రజాశక్తి-పీలేరు విధి నిర్వహణలో ఉన్న ఎపిఎస్‌పి 14వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ బి.గణేష్‌ (40)పై ఎర్రచందనం స్మగ్లర్ల వాహనం దూసుకు పోయిన ఘటనలో కానిస్టేబుల్‌ మృతి చెందిన సంఘటన అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఎస్‌పి బి.కృష్ణారావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం గుట్టకిందపల్లికి చెందిన గణేష్‌ (40) ఎపిఎస్‌పి 14వ బేటాలియన్‌ 2013వ బ్యాచ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తిరుపతి టాస్క్‌ఫోర్స్‌కు డిప్యూటేషన్‌పై వచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌కు అందిన రహస్య సమాచార మేరకు తిరుపతి నుంచి కంభంవారిపల్లె మండలంలోని గుండ్రేవారిపల్లి క్రాస్‌కు టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది చేరుకుని, వాహనాల తనిఖీ చేపట్టింది. పోలీసులను పసిగట్టిన స్మగ్లర్లు తమ వాహనం దారి మళ్లించే ప్రయత్నంలో విధుల్లో ఉన్న గణేష్‌ను ఢకొీంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏడు ఎర్రచందనం దుంగలతో సహా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తర లించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య అనూష, దేహాన్ష్‌, రాజ్‌ కిషోర్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. మృతుడు కానిస్టేబుల్‌ బి.గణేష్‌ భౌతిక కాయాన్ని ఎస్‌పి కృష్ణా రావు సందర్శించి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను కలిసిన తాము అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. అనంతరం మీడి యాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు. ముద్దాయిలను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్‌, పీలేరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ డిఎఫ్‌ఒ జె.వి.సుబ్బారెడ్డి, తిరుపతి అటవీశాఖ టాస్క్‌ఫోర్స్‌ డిఎఫ్‌ఒ శ్రీనివాసులు, మదనపల్లి అటవీశాఖ సబ్‌ డిఎఫ్‌ఒ శ్రీని వా సులు, పీలేరు అటవీ శాఖ రేంజ్‌ ఆఫీసర్‌ రామ్లానాయక్‌, ఇతర అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌ బి.గణేష్‌ భౌతిక కాయాన్ని సందర్శించి విచారం వ్యక్తం చేశారు. ముద్దాయిలు ఎంతటివారైనా పట్టుకుని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. మృతుని భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చి మనో నిబ్బరంతో ఉండాలని, ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు అందించడానికి వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం : డిఐజి కానిస్టేబుల్‌ బి.గణేష్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ డిఐజి శ్రీనివాస్‌ తెలిపారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను తమ శాఖ కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని సహాయ, సహకారాలు త్వరగా అందేలా చూస్తామని తెలిపారు. మృతుడి భార్యకు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు. మృతుడి భార్యను పరామర్శించి, మానసిక స్థైర్యాన్ని అందించారు.

➡️