ఎల్‌ఐసి ప్రగతిలో ఏజెంట్ల ముఖ్యభూమిక

Mar 18,2024 23:46

ఏజెంట్లను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు : ఎల్‌ఐసి సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిలో ఏజెంట్లు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. సోమవారం ‘మెగా బిజినెస్‌ డే’ సందర్భంగా అత్యధిక పాలసీలు చేసిన ఎల్‌ఐసి ఏజెంట్లను అరండల్‌పేట ఎల్‌ఐసి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సన్మానించారు. ఈ సందర్బంగా లక్ష్మణరావు మాట్లాడుతూ జాతీయీకరణ నాటి నుండి పాలసీదారులకు విశిష్టమైన సేవలందిస్తూ ఎల్‌ఐసి దేశ ప్రగతికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులను అందిస్తోందని అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఇ.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీమా వ్యాపారంలో ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకుని సుమారు 13 లక్షల మంది ఏజెంట్లు ఎల్‌ఐసిని అగ్రగామి సంస్థగా నిలపటంలో కీలక భాగస్వాములయ్యారని ప్రశంసించారు. కార్యక్రమానికి సీనియర్‌ బ్రాంచి మేనేజర్‌ జి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా అసిస్టెంట్‌ బ్రాంచి మేనేజర్‌ బి.రవీంద్ర, జె.రాజేంద్రప్రసాద్‌, ఎ.సత్యవాణి, ఎస్‌.కృష్ణారెడ్డి, జి.బాలాజీ, కనక రాజలక్ష్మి, ఎ.సుబ్బాయమ్మ, ఆర్‌.వి.ఎస్‌. శ్రీనివాస్‌, డి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️