ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

Mar 22,2024 20:21

 భగత్‌ సింగ్‌,రాజ్‌ గురు, సుకదేవ్‌ స్ఫూర్తితో ఉద్యమిస్తాం

ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భగత్‌ సింగ్‌ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డి వై ఎఫ్‌ ఐ ఆధ్వర్యంలో స్థానిక తోటపాలెంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కేంద్రాస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ శిరీష , రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ బాలాజీ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎస్‌ఎఫ్‌ఐకి మాత్రమే చెల్లిందని, ప్రతిఏటా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ విధంగా ఆరు నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. మన ద్వారా సాటివారి ప్రాణాన్ని కాపాడగలిగేది రక్తం మాత్రమేనని, అటువంటి రక్తదానానికి విద్యార్థులుగా ముందుకు రావడం శుభ పరిణామం అని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము , సిహెచ్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ దేశం కోసం 23 ఏళ్ల చిన్న వయసులో ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన వీరులు భగత్‌ సింగ్‌ , రాజ్‌ గురు , సుక్‌ దేవ్‌ అని, అటువంటి మహాత్ముల దారిలో నడిచే ఎస్‌ ఎఫ్‌ ఐ ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూనే, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏ విద్యార్థికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనా మొట్ట మొదట గుర్తొచ్చే సంఘం ఎస్‌ ఎఫ్‌ ఐ అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ ఐ అంటే పోరాటాలే కాదు సేవా కార్యక్రమాలలో కూడా ముందుంటా మని తెలిపారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులకు కళాశాల ప్రిన్సిపాల్‌ చిన్నం నాయుడు అభినందించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె .రవికుమార్‌, ఎం. హర్ష, ఎం. వెంకీ, సహాయ కార్యదర్శి పి. రమేష్‌ , నాయకులు రాజు , శివ, సోమేష్‌ , డివైఎఫ్‌ఐ నాయకులు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️