ఐవిఆర్‌ఎస్‌లో ఆ నలుగురు

Feb 13,2024 20:43

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై టిడిపి అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకోసం ఐవిఆర్‌ఎస్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) ద్వారా నలుగురు ఆశావహులపై ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదంతా ప్రజాదరణ ఉన్న నేతకు సీటు ఇచ్చేందుకేనా? లేక బహు నాయకత్వం నేపథ్యంలో గ్రూపులపోరును చల్లార్చి, పార్టీ అనుకున్న అభ్యర్థికి టిక్కెట్‌ కట్టబెట్టేందుకా? అన్న సందేహాలు వ్యక్తమౌతు న్నాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు కొండపల్లి కొండలరావు తన కుమారుడు శ్రీనివాసరావు కోసం కొద్దిరోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బొబ్బిలి రాజుల సిఫార్సులతో తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, విజయనగరం రాజుల సిఫార్సులతో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు కుటుంబం, మరోవైపు జిల్లా టిడిపిలో బొబ్బిలి, విజయనగరం రాజులు కీలకంగా ఉన్నారు. పైడితల్లి నాయుడు కురుమారులిద్దరూ చాలాకాలంగా రాజకీయవైఖరిలో ఉత్తర దక్షిణ ద్రువాల్లా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరం టిడిపి నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీలో దింపాలన్న దానిపై అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి ప్రతిస్థానాన్ని కీలకంగానే భావిస్తోంది. మరోవైపు వైసిపికి చెందిన స్థానిక సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైనవారు. టిక్కెట్‌ కూడా ఆ పార్టీ నుంచి దాదాపు ఖరారైనట్టే. ఇటువంటి పరిస్థితుల్లో అందుకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని టిడిపి అధిష్టానం తొలి నుంచీ భావిస్తోంది. కానీ, నియోజకవర్గంలో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, కరణం శివరామకృష్ణ చాలా కాలంగా నియోజకవర్గంలో వేరువేరు గ్రూపులు నడుపు తున్నారు. అప్పలనాయుడు ఆశిస్తుండగానే అతని సోదరుడు తన కుమారుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరి మధ్య రాజకీయంగా కూడా పొసగడం లేదు. ఇటవంటి పరిస్థితుల్లో నిజంగా ఈ నలుగురిలో ఎవరో ఒకరికోసమే ఐవిఆర్‌ఎస్‌ సర్వే జరుగుతోందా? లేక కొత్త అభ్యర్థిని తెరమీదకు తేవడం లేదా తప్పనిసరి పరిస్థితి అయితే పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థికి కేటాయిస్తారా? అంటూ నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చనడుస్తోంది.

➡️