కంకర మిల్లును పరిశీలించిన అధికారులు

ప్రజాశక్తి-పామూరు: మండలంలోని ఇనిమెర్ల గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ మినరల్‌ అండ్‌ మైన్స్‌ కంకర మిల్లును అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గ్రామంలో అనుమతులు లేకుండా కంకర మిల్లును ఏర్పాటు చేయడం వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని, అలాగే మోపాడు రిజర్వాయర్‌ పరిధిలోని ఇరిగేషన్‌ భూములలో కంకర మిల్లును ఏర్పాటు చేయడం, పంట పొలాల నుంచి విద్యుత్‌ స్తంభాలు వేసి కంకర మిల్లు వద్దకు లైన్లు లాగడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందని గ్రామానికి చెందిన కొంతమంది రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్‌ ఆదేశాలు మేరకు రెవెన్యూ, మైనింగ్‌, విజిలెన్స్‌, విద్యుత్‌ శాఖ సంబంధిత శాఖల అధికారులు బుధవారం కంకర మిల్లు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించి మిల్లు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. ఈ తనిఖీలో కనిగిరి ఆర్డీవో జాన్‌ఇర్విన్‌, మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జగన్నాథరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వర్మ, విజిలెన్స్‌ అధికారి ధీరజ్‌, విద్యుత్‌ శాఖ డిఈ హరిబాబు, ఏఈ జిలానీబాషా, ఆర్‌ఐ బత్తుల మల్లికార్జున, కంకరమిల్లు నిర్వాహకులు సిద్ధమూర్తి నారాయణరెడ్డి, పువ్వాడ రాంబాబు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

➡️