‘కంది’కి మార్కెట్‌ ధర చెల్లిస్తాం

ప్రజాశక్తి-పొదిలి: కంది రైతులు పండించిన పంటకు మార్కెట్‌ ధరతో సమానంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధర చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజర్‌ జి శీరిష అన్నారు. మంగళవారం మండలంలోని పాములపాడు గ్రామంలో ఇటీవల నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కందులను బయట అమ్ముకోవద్దని సూచించారు. బయట మార్కెట్‌లో ఎంత ధర ఉందో అంతే ధరకు రైతుల వద్ద కొనుగోలు చేసిన వాటికి చెల్లిస్తామన్నారు. మన ప్రభుత్వం ప్రతి రోజూ మార్కెట్లో గిట్టుబాటు ధరను పరిగణలోకి తీసుకుని ఆ ధరకే రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులు కందుల కొనుగోలు కేంద్రంలో అమ్మిన ఒకటి రెండు రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కాబట్టి రైతులు అపోహలకు గురికాకుండా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్‌ నమోదు చేయించుకోవాలన్నారు. అనంతరం ఈమె రైతులతో కలిసి కంది పొలాలను పరిశీలించారు. అనంతరం ఆమె గ్రామంలోని కంది పంటలను పరిశీలించి దిగుబడి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఎంవి సత్యనారాయణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ దాసరి గంగాధర్‌, టిఏలు విజరు, ఝాన్సీ, వైష్ణవి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిటిలు రాంనారాయణరెడ్డి, డేవిడ్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి ఎస్‌కె జైనులాబ్దిన్‌, మాదాలవారిపాలెం సహకార సంఘం అధ్యక్షులు ఆనికాళ్ల ఈశ్వరరెడ్డి, గ్రామ నాయకులు పేరం కోదండ రామిరెడ్డి, వ్యవసాయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

➡️