కనీస సౌకర్యాలు కరువు

Dec 5,2023 21:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలోను, వారికి మౌలిక వసతులు కల్పించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని, చలి గాలులు వీస్తుండడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని తెలిపారు. అందరూ ఇళ్లల్లో ఉంటే మున్సిపల్‌ కార్మికులు మాత్రం మురుగునీరు వల్ల ప్రజలకు ఎటువంటి అనారోగ్యం రాకూడదని భావించి వర్షంలో తడుస్తూ చెత్త సేకరణ పనులు చేపడుతున్నారు. కార్మికులకు గత ఐదేళ్లగా ప్రభుత్వం కనీసం రైన్‌కోట్లు కూడా ఇవ్వలేదు. మూడు నెలల హెల్త్‌ అలవెన్స్లు బకాయిలు ఉన్నాయి. రెండేళ్లగా కార్మికులకు ఎటువంటి రక్షణ పరికరాలూ ఇవ్వడం లేదు. అయినా ఎండలోను, వానలోను వారి పనిచేస్తునే ఉన్నారు. తుపాను సమయంలోనూ వారు పని చేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే రైన్‌ కోట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని జగన్మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.

➡️