కన్నా నివాసంలో టిడిపి నేతలు భేటి

 కన్నా లక్ష్మీనారాయణను కలిసిన పెమ్మసాని

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి

గుంటూరులోని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో టిడిపి ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తదితరులు హాజరు అయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.టిడిపి, జనసేనతో పాటు బిజెపితో కూడా పొత్తు ఉంటే ఏయే సీట్లలో సర్ధుబాటు చేసుకోవాల్సి ఉంటుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. అయితే చర్చల వివరాలను నేతలు మీడియాకు వివరించలేదు. సాధారణ భేటిగా పేర్కొన్నారు. వైసిపి బిసి అభ్యర్థులను ఎక్కువ మందికి అవకాశం ఇస్తుండటం వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కనీసం రెండు అసెంబ్లీస్థానాల్లో బిసిలకు అవకాశం ఉండేలా చూడాలని పార్లమెంటుకు పోటీ చేయనున్న పెమ్మసాని, లావు లావు శ్రీకృష్ణదేవరాయులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో గుంటూరు లోక్‌సభ పరిధిలో గుంటూరు పశ్చిమ, పల్నాడు పరిధిలో నర్సరావు పేట బిసిలకు ఇచ్చేలా చూడాలని చర్చించినట్టు తెలిసింది.వైసిపి నర్సరావుపేట ఎంపి స్థానంతోపాటు మంగళగిరి, గురటూరు పశ్చిమ స్థానాలను ఇప్పటికే బిసిలకు కేటాయించిన నేపధ్యంలో ఈ అంశం చర్చించినట్టు సమాచారం. తాను నర్సరావుపేట నుంచి పోటీ చేయనున్నట్టు శ్రీకృష్ణదేవరాయులు అనంతరం నర్సరావుపేటలో నిర్వహించిన వ్యాపారులు,న్యాయవాదుల సమావేశంలో తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాల తో పాటు రైలు, రవాణా రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

ప్రముఖులను కలిసిన డాక్టర్‌ పెమ్మసాని

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతలు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డాక్టర్‌ మాకినేని పేద రత్తయ్యలను తెలుగుదేశం పార్టీ నేత డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ శనివారం నాడు గుంటూరులో వారి స్వగహాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీల వారీగా స్థితిగతులపై ఆయన నేతలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వ్యూహాల గురించి వారి నుండి ఆయన సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరువురు నేతలకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. అదేవిధంగా గుంటూరులో క్రేన్‌ సంస్థల అధినేత శ్రీ గంజి కాంతారావు కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో పలు విషయాలపై ముచ్చటించారు.

➡️