కళ్యాణమస్తుతో బాలికా విద్యకు తోడ్పాటు

Feb 20,2024 21:40

 ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద కులాంతర వివాహ ప్రోత్సాహాల నిమిత్తం ఇస్తున్న పారితోషికం బాలికా విద్య ప్రోత్సాహానికి తోడ్పాటు నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాల కింద వధూవరులు ఇద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులై వుండాలనే నిబంధనల కారణంగా పేద కుటుంబాల్లోని బాలబాలికలు తప్పనిసరిగా పదోతరగతి పూర్తి చేస్తున్నారని చెప్పారు.కళ్యాణమస్తు, షాదీ తోఫా ఆర్దిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. జిల్లాలో ఐదో విడతలో 370 జంటలకు రూ.2.35 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. వీరిలో 296 మంది బిసి., ఓసి 1, ఎస్‌సి 60, ఎస్‌టి 13జంటలు వున్నాయి. వీటిలో ఒకే కులంలో జరిగిన వివాహాలకు సంబంధించి 331మందికి, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు 34, విభిన్నప్రతిభావంతులు ఐదుగురు వున్నట్టు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని యీ పథకం లబ్దిదారులకు రూ.2.35 మొత్తం విడుదలకు సంబంధించిన చెక్కును కలెక్టర్‌, ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌తో పాటు ఎంఎల్‌సి సురేష్‌బాబు, డిసిసిబి ఛైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ అవనాపు భావన, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణచక్రవర్తి, డిఎస్‌డబ్ల్యుఒ రామానందం, మైనారిటీ సంక్షేమ అధికారి రుద్రపాటి శామ్యూల్‌ జాన్‌ పాల్గొన్నారు.

➡️