కార్మికుల పొట్టగొట్టేలా టిటిడి హెల్త్‌ టెండర్‌

Dec 14,2023 21:01
పరిపాలనా భవనం ఎదుట నిరసన

కార్మికుల పొట్టగొట్టేలా టిటిడి హెల్త్‌ టెండర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ టీటీడీలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం హెల్త్‌ విభాగంలో విడుదల చేసిన ఆన్లైన్‌ టెండర్లలో పెట్టిన నిబంధనలు మార్చాలని కోరుతూ నేడు టిటిడి పరిపాలన భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు టి సుబ్రమణ్యం మాట్లాడుతూ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 45 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న వారినే తీసుకోవాలని పెట్టిన నిబంధన వల్ల బతుకులు పోతాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కొత్తగా పెట్టిన ఈ నిబంధనను తొలగించాలని, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులను 60 సంవత్సరాలు వరకు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మహిళలు 25శాతం, మగవారు 75శాతం ఉండే విధంగా కార్మికులను పెట్టుకోవాలని పెట్టిన నిబంధన సరైంది కాదని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని టిటిడి యాజమాన్యాన్ని కోరారు. హెల్త్‌ విభాగం కార్మికులకు, ఎఫ్‌ఎంఎస్‌ విభాగం కార్మికులకు పెండింగ్‌ బ్రహ్మోత్సవ బహుమానం వెంటనే చెల్లించాలని, లడ్డు, వడ మంజూరు చేయాలని కోరారు. పెంచిన జీతాలను క్యాటగిరి వారిగా ఇవ్వాలని అన్నారు. సులభ్‌ సంస్థ చెల్లించాల్సిన రెండు కోట్ల పెండింగ్‌ జీతాలను కార్మికులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిఐటియు నగర ఉపాధ్యక్షురాలు పి బుజ్జి, కాంట్రాక్ట్‌ కార్మికులు రాజా, నోమేష్‌, శ్రీనివాసులు, రామ్మూర్తి, ధనమ్మ, సరస్వతి, గౌరీ, ధనలక్ష్మి, రఘు, ఏకాంబరం, సిద్ధూ, ఆనందు, శంకరు సురేషు, సుబ్బయ్య, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.పరిపాలనా భవనం ఎదుట నిరసన

➡️