కాలువపై పలకలు తొలగింపు

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : మిచౌంగ్‌ తుపాన్‌ దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కమిషనర్‌ జె. రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు యుద్ధ ప్రాతిపదికన జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ పరిధిలో వరద నీరు మళ్లించేందుకు పట్టణం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువలపై పలు కూడళ్ల వద్ద ఉన్న పలకలను అక్కడికక్కడ తొలగించడమే కాకుండా, బెలగాం వైపు ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం నుండి ఆర్టీసీ డిపో అవుట్‌ గేట్‌ రహదారి వరకు ఉన్న ప్రధాన కాలువపై ఉన్న పలకలను పూర్తిస్థాయిలో చెత్తల, వ్యర్ధాలను తొలగించేందుకు ప్రైవేట్‌ జెసిబిలను, ఉపయోగించి సిబ్బంది సహాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు మున్సిపల్‌ పరిధిలోని గెడ్డవీధి, చైతన్య చైతన్య స్కూల్‌కు వెళ్లే ప్రాంతం, బంగారమ్మ కాలనీ మురుగు నీరు, వర్షపు నీరు ప్రవహించే గెడ్డకు సంబంధించి అడ్డంకులుగా ఉన్న మురుగు మట్టి తొలగింపు పనులు, బెలగాం గెడ్డ వీధి దగ్గర రోడ్డుకు ఇరువైపులా మురుగు నీరు పోవుటకు, రెడ్డి వీధి చివరు ప్రాంతంలో పేరుకు పోయిన చెత్త, మట్టి తొలగింపు చర్యలు, కొత్తవలస దుర్గ గుడి ఎదురుగా ఉన్న కాలువలో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగింపు పనులు చేపట్టారు. ఈ పనుల్లో మున్సిపల్‌ కమిషనర్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌.మురళి, సచివాలయాల శానిటరీ సెక్రటరీలు, ప్రజారోగ్య విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️