కుటుంబ పోషణ ఎలా..?

కుటుంబ పోషణ

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందేలా రోజంతా తీరుబడులేకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు కరవయ్యాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం లేక కుటుంబ పోషణ భారంగా మారింది. చేస్తున్న పనికి వస్తున్న జీతం సరిపోక అప్పులు చేసి బతుకు ఈడుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 3,200 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అందిస్తున్న సేవల్లో ఆశాలు కీలకం. ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సాహించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి పనులతో పాటూ, పుట్టిన చిన్న పిల్లలకు ఇమ్యునైజేషన్‌ వ్యాక్సిన్లు వేయించడం, 12 వారాల్లోపు ఉన్న గర్భిణులను గుర్తించి వారిని నమోదు చేయడం వంటి విధులూ వీరే నిర్వహిస్తున్నారు. వీటితో పాటూ డెంగీ, టిబి, లెప్రసి, సర్వేలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఆరోగ సర్వేలో సైతం వీరి పాత్ర ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఓ పక్క కనీస వేతనాలు లేక అల్లాడుతుంటే, మరోవైపు ప్రభుత్వ పథకాలు దూరమై పని ఒత్తిడి పెరిగి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి వారికి బిడ్డ పుట్టి, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగే వరకూ వైద్యం సాయం అందించాల్సిన పని ఆశాలపైనే ఉంది. అంతేకాకుండా వైద్య,ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోతుందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు కనీస వేతనాలు సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లినా ఏనాడూ సర్కారు పట్టించుకోలేదని వర్కర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇస్తున్న వేతనం దినసరి కూలి కంటే తక్కువ అని చెబుతున్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా నెలలు తరబడి పెండింగ్‌ లోనే ఉంచుతున్నారని తెలిపారు. అనేకమంది ఆశలను కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరుతున్నారు. జీవిత బీమా సౌకర్యం లేక సతమతమవుతున్నారు. మరణించిన ఆశాల కుటుంబంలో అర్హులను గుర్తించి వారికే ఆశలుగా అవకాశం కల్పించాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

➡️