కొత్తవలస రైల్వే స్టేషన్లో నిలిచిన అరకు రైలు

Feb 8,2024 21:28

ప్రజాశక్తి-కొత్తవలస  : చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో కొత్తవలస రైల్వే స్టేషన్లో విశాఖ – కిరండోలు పాసింజర్‌రైలు మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిచిపోయింది. దీంతో అరకు అందాలు చూసేందుకు వె ళ్లిన ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. చిమిడిపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలును పునరుద్ధరించడానికి రైల్వే శాఖ హుటా హుటినా సహాయక చర్యలు చేపట్టింది. అరకు అందాలు చూసేందుకు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశాకు చెందిన పర్యాటకులు నిత్యం వందలాది మంది ప్రయాణికులు విశాఖ కిరండోల్‌ పాసింజర్‌ రైలులో వెళ్తుంటారు. ఈ మార్గం గుండా వెళ్తే అరకు అందాలతో పాటు శివలింగాపురం నుండి అరకు చేరుకునేంతవరకు ఉన్న గృహలు, కొండలు, లోయలు అందాలను ఆస్వాదించవచ్చు అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ గురువారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్‌ నుండి బయలుదేరిన విశాఖ కిరండోలు పాసింజర్‌ రైలు కొత్తవలస సమీపానికి వచ్చేసరికి రైల్వే శాఖ నుండి ప్రయాణికులకు ఒక చేదువార్త వినిపించింది. చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురవ్వడంతో ఈ రైలును కొత్తవలస రైల్వే స్టేషన్లోనే నిలిపి వేస్తున్నట్లు తెలపడంతో స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీస్‌ వద్దకు ప్రయాణికులు చేరుకొని ఆందోళన చేశారు. రైలు ప్రమాదం ఉదయం జరిగితే ఇప్పటివరకు తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ముందుగానే సమాచారం ఇస్తే విశాఖ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం కదా అని ప్రశ్నించారు. రైల్వే శాఖ వైఫల్యానికి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది, స్టేషన్‌ మాస్టర్‌ ఎంత సర్ది చెప్పినా ప్రయాణికులు వినకపోవడంతో పై అధికారులతో చర్చించిన స్టేషన్‌ మాస్టర్‌ రైలును ముందుకు పంపిస్తున్నట్లు అనౌన్సు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

➡️