కొత్త భూ హక్కు చట్టం రద్దు కోసం కలెక్టర్‌కు వినతి

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు
ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా కోర్టు న్యాయవాదులు కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం దీక్షలో న్యాయవాదులు పి.స్వాతి, పి.శేషసాయిరాము, సిహెచ్‌.వెంకటరావు, పి.రాజేష్‌లింగం కూర్చున్నారు. వీరికి సంఘీభావంగా న్యాయవాదులు పెద్దసంఖ్యలో దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్‌ వరకూ ప్రదర్శనగా వెళ్లి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెవికె సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, ఈ చట్టం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని వివరించారు. కలెక్టర్‌ స్పందిస్తూ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు నీలం రామ్మోహనరావు, చిగురుపాటి రవీంద్రబాబు, కొల్లి శంకరరావు, జె.నరసింహారావు, పి.రాజారావు, ఎస్‌.సత్యనారాయణ, జి.శ్రీను, జిలాని, కుమారి నంద, పాములు, బ్రహ్మేశ్వరరావు, శాంతకుమార్‌, బార్‌కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.బ్రహ్మానందరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ జి.విజయరాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️