కొనసాగిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

Feb 17,2024 20:39

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు శనివారం కొనసాగాయి. కలెక్టరేట్‌ ఎదుట జెఎసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ, జిల్లా కార్యదర్శి సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వెంటనే ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేసి,బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా లో కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

బొబ్బిలి : జిపిఎస్‌ రద్దు చేసి, ఒపిఎస్‌ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘం జెఎసి నాయకులు కె.విజయగౌరి, జె.సి.రాజు, రౌతు రామమూర్తి, కె.జోగారావు, బి.రామారావు స్పష్టంచేశారు. ఎన్నికల హామీ మేరకు ఒపిఎస్‌ అమలు చేయాలని కోరుతూ ఎన్‌జిఒ హోం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ శనివారం ర్యాలీ చేపట్టారు. అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వస్తే సిపిఎస్‌ రద్దు చేసి, ఒపిఎస్‌ అమలు చేస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చి, అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నెల్లిమర్ల : ఉద్యోగులకు పిఆర్‌సి అమలు చేసి, పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేసి సిపి ఎస్‌ రద్దు చేయాలని జెఎసి ఛైర్మెన్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయ, పింఛన్‌దార్లు, కార్మిక జెఎసి నెల్లిమర్ల తాలూకా యూనిట్‌ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గణేష్‌ మాట్లాడుతూ పిల్లల పెళ్లి కోసం దాచుకుంటున్న జిపిఎఫ్‌ సొమ్మును కూడా విడుదల చేయకపోవడం ఘోరమన్నారు. పెన్షన్‌ దారులకు వెంటనే అడిషనల్‌ క్వాంటం పెన్షన్‌ విడుదల చేసి, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ రెగ్యులైజేషన్‌ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ విశ్వనాథరాజు, ఎపిటిఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌ ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పైడిరాజు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పతివాడ త్రినాథ్‌, నెల్లిమర్ల ఎపిఎన్‌జిఒ సెక్రటరీ వై.రమణ, కోశాధికారి ధనుంజరు, వైస్‌ ప్రెసిడెంట్లు నవీన్‌, నాగరాజు, జాయింట్‌ సెక్రటరీ శంకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జెఎసి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్‌, జిపిఎస్‌ని రద్దు చేసి ఓపిఎస్‌ని అమలు చేయాలన్నారు. 12వ పిఆర్సిలో మధ్యంతర భృతి 30శాతం ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులకు అప్రెంటీస్‌ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో జెఎసి ప్రతినిధులు లెంక అప్పలనాయుడు, మీసాల అప్పలనాయుడు, బి.సురేష్‌, జగదీశ్వరి, సత్య శ్రీనివాసరావు, అంపోలు సత్యనారాయణ, ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సత్యంతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

భోగాపురం: ఉద్యోగులు సమస్యలు వెంటనే ప్రభత్వం పరిష్కరించకపోతే ఉద్యోగులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని భోగాపురం తాలూకా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరు దుర్గారావు పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు మూడు మండలాల ఉద్యోగులు, పింఛనుదారులు ధర్నా చేపట్టారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల నాయకులు సూరి అప్పారావు, గణపతిరావు, ఉమాపతి, శరత్‌ కుమార్‌, సీతం రాజు, బంగారు బాబు, గురు భక్తులు, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఉద్యోగులు, ఫెన్షనర్లు పాల్గొన్నారు..

➡️