కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

మండపేటలో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-యంత్రాంగం

డిమాండ్ల సాధనకై అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు నిరసన తెలిపారు.

మండపేట వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం నిరసన తెలిపారు. అనంతరం పలువురు అంగన్‌వాడీ నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలు, గ్రాడ్యుయేట్‌, పిఎఫ్‌ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకుండానే సెంటర్లు తెరవాలని ప్రభుత్వం కలెక్టర్‌ ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తోందన్నారు. అంగన్‌వాడీ సెంటర్లు తెరవకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతోందని ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు అంగన్‌వాడీలు భయపడేదిలేదన్నారు. అంగన్‌వాడీలకు అన్నీ ఇచ్చామని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. సమస్యలు పరిష్కరించుకుంటే అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు తహశీల్దారన్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేస్సున్న అంగన్‌వాడీలు శనివారం పొర్లు దండాలతో నిరసన తెలిపారు. న్యాయబద్ధమైన సమ్మె ను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అభ్యంతరకర మన్నారు. అంగన్‌ వాడీల సమ్మె ఎ స్మా ప్రయోగించడాన్ని ప్రజా సంఘాలు తీవంగా ఖండిచాయి.

 

➡️