కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. గురువారం కలెక్టరేట్లోని మినీ విసి హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు మేరకు జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు డోర్‌ టు డోర్‌ ప్రచారాలకు కూడా ముందస్తుగా అనుమతులు పొందాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా 24/7 ప్రకారం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎనోార్స్మెేంట్‌ కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 18004257090 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఎవరైనా కాల్‌ చేయవచ్చునని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఇంటిగ్రేటెడ్‌, 12 చెక్‌పోస్టులలో పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో మోడల్‌ కోడ్‌ అమలును కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లాలో అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే 72 గంటల్లోగా తమ దష్టికి వచ్చిన వాటన్నిటిని తొలగించామన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను కొనసాగిస్తామన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసే పార్టీ కార్యాలయాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒక బ్యానర్‌, ఒక ప్లాగ్‌ను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఎన్నికల నియమాలని అతిక్రమించి రాజకీయ ప్రచారాలలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లు, ఇద్దరు కాంట్రాక్ట్‌ ఎంప్లాయిలపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల నియమావళిలో ఉల్లంఘనలు జరిగితే తమ దష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలో ఫామ్‌ 7, 8లను పూర్తిగా పరిష్కరించామని కొత్త ఓటర్‌ నమోదు కొరకు ఫామ్‌ 6ను నామినేషన్‌ రోజు వరకు తీసుకుంటామన్నారు. హోమ్‌ ఓటింగ్‌ అంశంలో సెక్టార్‌ అధికారుల ద్వారా రిటర్నింగ్‌ అధికారులు త్వరలో సర్వే చేయడం జరుగుతుందని రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణరావు, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి థియేటర్లలో ఎన్నికల ప్రచార ప్రకటనలకు రాజకీయ పార్టీల నేతలు, థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని తెలిపారు. ఎంసిసి అమలులో ఉన్నంతవరకు రాజకీయ పార్టీల నేతలు, థియేటర్‌ మేనేజ్మెంట్‌ వారు కోడ్‌కు లోబడి ప్రవర్తించాలన్నారు. ఆర్‌డిఒలు, తహశీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లను ఆకస్మిక తనిఖీలు చేసి నియమాలను ఏ థియేటర్‌ వారైనా ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

➡️