కౌలు రైతుల సాగు చట్టాన్ని సవరించాలి

Mar 9,2024 21:06

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : కౌలు రైతుల సాగు చట్టాన్ని సవరించాలని ఎపి కౌలు రైతుల సంఘం కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్‌ చేశారు. పంట సాగు చట్టాన్ని సవరిస్తామని, కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలూ తమ ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక ఎన్‌ పి అర్‌ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాలు పేరుతో బటన్‌ నొక్కి డబ్బులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కౌలు రైతులకు ఇవ్వాల్సిన రూ.1000 కోట్లు ధాన్యం బకాయిలు ఇవ్వలేదన్నారు. అనేక పంటలకూ మద్దతు ధర లేదన్నారు. కౌలు రైతులు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. పంటకు గిట్టు బాటు ధర లేకపోవడం వల్ల అప్పుల ఊ బిలో కూరుకుపోతున్నారని తెలిపారు. కౌలు రైతులకు రుణ విముక్తి కలిగించే విధంగా ఎన్నికల మేనిఫెస్టో చేర్చి, ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో సాగు తగ్గకుండా సరైన ప్రణాళికలు ప్రభుత్వం అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేయాలని,కౌలు రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వాలని కోరారు. భూ యజమానుల సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ సిసిఅర్‌ కార్డులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రైతులు గిట్టు బాటు ధర చట్టం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, ఈనెల 14న ఢిల్లీలో లక్షలాది మందితో భారీ సభ జరగనుందని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఢిల్లీకి రాని రైతులు కార్మిక,రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అదే రోజు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణ మూర్తి, కౌలు రైతుల సంఘం నాయకులు కె.నారాయణరావు, అర్‌.అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️