‘గడపగడపకు..’లో ఎమ్మెల్యేను నిలదీత

Dec 18,2023 20:44

 ప్రజాశక్తి-రేగిడి  :  మండలంలోని సంకిలి గ్రామంలో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులును వైసిపి కార్యకర్తలు నిలదీశారు. సంక్షేమ పథకాల అమల్లో జాప్యమవుతోందని, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిచేయక పోవడంపై కార్యకర్తలు పుప్పాల సురేష్‌, బండి అవినాష్‌, వాలంటీర్‌ ప్రియాంక నిలదీశారు. సచివాలయ భవనం పూర్తయినా ఇంతవరకు రంగులు వేయకుండా అసంపూర్తిగా ఎందుకు ఉంచారోనని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. గ్రామకంఠంలో ఖాతా నెంబరు 97, 319లో నిరుపేదలకు జగనన్న కాలనీకి సంబంధించి ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇంతవరకు ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇళ్లు నిర్మించిన వారికి బిల్లులు చెల్లింపులు కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాలంటీర్‌ ప్రియాంకకు 8 నెలలుగా జీతం అందలేదని, మండల, జిల్లా స్థాయి స్పందనకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొదర వీధి, చాకలి వీధి, పలు వీధుల్లో జగనన్న ఇళ్ల లబ్ధిదారులు పలు సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. వైస్‌ ఎంపిపి వి.జగన్మోహనరావు వారిని అడ్డుకుని సర్దిచెప్పారు. పలు సమస్యలపై స్థానిక ఎంపిటిసి మజ్జి శ్రీనివాసరావు, సర్పంచ్‌ బుడుమూరు పట్టాభిని ఎమ్మెల్యే జోగులు కార్యకర్తల వద్దే ప్రశ్నించారు. సచివాలయం పూర్తయినా, అనివార్య కారణాల వల్ల నిలుపుదల అయిందని వారు చెప్పారు. జగనన్న కాలనీకి సంబంధించి కోర్టులో పిటిషన్‌ ఉందని తెలిపారు. రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు స్థలాలు లేవని ఎమ్మెల్యేకు వివరించారు. సచివాలయాన్ని అన్ని హంగులతో పూర్తి చేసి తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి టంకాల అచ్చెన్నాయుడు, రాయపురెడ్డి కృష్ణారావు, కోదండరావు, వైసిపి నాయకులు శ్రీనివాస రావు, రమేష్‌, ఎంపిడిఒ శ్యామలకుమారి, హౌసింగ్‌ ఎఇ జగన్మోహనరావు, ఎపిఒ బి.గోవిందరావు, ఎఒ మురళీకృష్ణ, ఎపిఒ హరినాథ్‌ పాల్గొన్నారు.

➡️