గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

Mar 9,2024 21:18

  ప్రజాశక్తి-విజయనగరం కోట  : గర్భిణులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మనోరంజిని అన్నారు. పోషణ పక్వడా లో భాగంగా పౌష్టికాహార పక్షోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈనేపధ్యంలో బిసి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని డిడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే పిల్లలు ఆరోగ్యకరంగా పుడతారని అన్నారు. స్థానికంగా దొరికే మునగాకులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని, మునగాకు ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఫోర్టుపైడ్‌ రైస్‌ ను అందరూ వినియోగించుకోవాలని, గంజి పారవేయకుండా తాగడం గాని లేదా కుక్కర్లో అన్నం వండుకోవడం గానీ చేయాలని, దీని ద్వారా బియ్యంలో ఉన్న పోషక విలువలు శరీరానికి అందుతాయని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాగి పిండి, అటుకులు, ఖర్జూరం చెక్కిలు తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారన్నారు ఐసిడిఎస్‌ పీడీ శాంత కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ అనురాధ, జానకి, అంగన్వాడీ కార్యకర్తలు తిరుమల, రోహిణి, ప్రదీప ఆయాలు, తల్లులు పాల్గొన్నారు.

➡️