గాజువాక వైసిపిలో గ్రూపుల గోల!

గాజువాక వైసిపి

టిక్కెట్‌ కోసం ప్రయత్నాల్లో విజయనగరం బాట

పోటాపోటీగా బొత్స ఝాన్సీతో కలయిక

ప్రజాశక్తి -గాజువాక : గాజువాక వైసిపిలో గ్రూపు విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజా, మాజీ సమన్వయకర్తలకు అనుకూలంగా ఉన్న గ్రూపులు పోటాపోటీగా బలప్రదర్శన చేస్తూ, గాజువాక టిక్కెట్‌కు ప్రయత్నాలను కొనసాగిస్తూ పట్టునిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ పార్లమెంటరీ స్థానం వైసిపి సమన్వయకర్తగా నియమితులైన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీరాణిని విజయనగరం వెళ్లి కలిసి వస్తున్నారు. గాజువాక నియోజకవర్గం వైసిపి సమన్వయకర్తగా ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నెలరోజుల క్రితం వరకు కొనసాగారు. ఈ నేపథ్యంలో తనకే ఎమ్మెల్యే టిక్కెట్‌ వస్తుందన్నంతగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇంతలో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు చేసిన సర్వే నివేదికలు, మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని 70వ వార్డు కార్పొరేటర్‌ ఉరుకూటి రామచంద్రరావు (చందు)ను వైసిపి అధిష్టానం నియమించి గ్రూపు విబేధాలకు తెరలేపింది. దీంతో గాజువాక వైసిపిలో బాహాటంగానే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. సమన్వయకర్తల మార్పే తప్ప, ఎమ్మెల్యే టిక్కెట్లు కాదంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎవరికివారే తమ సత్తాను చూపేందుకు యత్నిస్తున్నారు. ఇందులోభాగంగా మూడు రోజుల క్రితం 21నతాజా సమన్వయకర్త రామచంద్రరావు వర్గం విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని కలిసి వచ్చారు. ఇక బుధవారం తిప్పలు దేవన్‌రెడ్డి వర్గం విజయనగరం వెళ్లి ఆమెను కలిసి వచ్చారు.విశాఖ ఎంపీగా గెలవాలంటే తమ సహకారం ఉండాలని, అదే సమయంలో తమకు టిక్కెట్‌ వచ్చేలా చూడాలంటూ ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి సత్తిబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలతో తన కొడుకుకు టిక్కెట్‌ కోసం ఎమ్మెల్యే నాగిరెడ్డికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే చందుకు టిక్కెట్‌ కోసం మంత్రి అమర్నాథ్‌ చూస్తున్నట్లు సమాచారం ఇలా గాజువాకలోని వైసిపి గ్రూపులు విజయనగరం బాట పడుతూ, బలనిరూపణతోపాటు టిక్కెట్‌కోసం యత్నాలు సాగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరికి వారే లాబీయింగ్‌ ముమ్మరం చేస్తుండడంతో చివరకు ఎవరిది పైచేయి అవుతుందోనని పలువురు ఆసక్తి చూస్తుండగా, ఇదే సమయంలో ఒకరికి సీటిస్తే, రెండో వర్గం సహకరిస్తుందాయన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

➡️