గిరిజన గ్రామాల్లో సబ్‌ కలెక్టర్‌, ఎఎస్‌పి పర్యటన

గిరిజనుల సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టరు దాత్రి రెడ్డి, ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌

ప్రజాశక్తి -సీలేరు

జికె.వీధి మండలం కొత్తపాలెం, కొమ్మ సంపంగి, కొయ్యూరు మండలం మండపల్లి తదితర మారుమూల గ్రామాల్లో పాడేరు సబ్‌ కలెక్టర్‌ దాత్రి రెడ్డి, చింతపల్లి ఎఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌ మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండపల్లి గ్రామస్తులు తమ సమస్యలు తెలియజేస్తూ.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం తీసుకోవటానికి తాము 17 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. రహదారి సౌకర్యం ఉన్నంతవరకు బియ్యం పంపిణీ పీకే వాహనాన్ని పంపించి బియ్యం అందజేయాలని అధికారులకు కోరగా, ఈ విషయంపై ఇన్‌ఛార్జి తహశీల్దారుకు సబ్‌ కలెక్టర్‌, ఎఎస్‌పి ఆదేశాలు జారీ చేశారు. మినీ అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆధార్‌ కేంద్రాన్ని జికె.వీధి సంత రోజు ఏర్పాటు చేయాలని, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వాలని కోరారు. 604 పట్టాల మంజూరుకు సర్వే త్వరగా పూర్తిచేసి ప్రతిపాదనలు పంపాలని ఇన్‌ఛార్జి తహశీల్దారు ఆదేశించారు. ఆధార్‌ సెంటర్‌పై ఎంపీడీవో ఉమామహేశ్వరరావును ఆదేశించారు. కొమ్మ సంపంగి గుడ్లపనస, చాట్రాయి గ్రామాలకు స్కూల్‌ భవనాలు ఏర్పాటుకు ప్రతిపాదన పంపిస్తామనిసంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం యువతకు వాలీబాల్‌ కిట్లును సబ్‌ కలెక్టర్‌, ఎఎస్‌పి అందజేశారు. పిల్లల్ని బాగా చదివించాలని, యువత గ్రామాల్లోనే ఉండిపోకుండా వివిధ రకాల ఉపాధి మార్గాలను చూసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జీకే వీధి సిఐ అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ అప్పలసూరి, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఇన్‌ఛార్జి తహశీల్దారు కుమారస్వామి, ఆర్‌ఐ మహదేవ్‌, ఆర్డిఓ పాపారావు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️