గుంటూరు బాపనయ్యకు నివాళి

ప్రజాశక్తి-పిసిపల్లి: పేదల పెన్నిధి, కష్టజీవుల ఆశాజ్యోతి, బడుగు, బలహీన వర్గాల నాయకులు గుంటూరు బాపనయ్య వర్థంతి సందర్భంగా పెదచెర్లోపల్లి మండలం కోదండ రామపురంలో ఆయన చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బడుగు జనార్దన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగాయతిప్పలోని ఒక నిరుపేద దళిత వ్యవసాయ కార్మిక కుటుంబంలో 1919లో సోమమ్మ రామస్వామి దంపతులకు బాపనయ్య జన్మించారన్నారు. ఎర్రజెండా పట్టి ప్రతివానికి భూమి సాధించడంలో నాటి కమ్యూనిస్టు పార్టీలు చేసిన కృషిలో బాపనయ్య పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే గాను, ఒకసారి ఎమ్మెల్సీగాను పనిచేసిన బాపనయ్య పదవికే వన్నె తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగి చిన్నమాలకొండయ్య, ఎర్రగుంట్ల బాలయ్య, పెద్దబాలయ్య, లక్ష్మమ్మతోపాటు స్థానిక వ్యవసాయ కూలీలు, పేదలు పాల్గొన్నారు.

➡️