గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఆనందబాబు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త టిడిపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర మాజీమంత్రి, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు సూచించారు. భట్టిప్రోలు కన్యకా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అనేక ముఖ్యమైన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు అన్నారు. వైసీపీ పాలన రాష్ట్రం అధోగతిపాలు అయిందని, రాష్ట్ర ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే భట్టిప్రోలు గ్రామాభివృద్ధి-నగ సత్యాలు అనే కరదీపిక పుస్తకాన్ని ఆనందబాబు ఆవిష్కరించారు. ఈ కరదీపికలో గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు రూపొందించారు. ఈ కరదీపికను గ్రామం మొత్తం పంపిణీ చేసి గత ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే విధంగా కృషి చేయనున్నట్లు సాయిబాబా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ వాకా శేషుబాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, టిడిపి మండల మాజీ కన్వీనర్‌ వై కరుణ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ ఎడ్ల జయశీలరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు కనపర్తి సుందర్రావు, బీసీ సెల్‌ నియోజకవర్గ నాయకులు బట్టు మల్లికార్జునరావు, నాయకులు కంభం సుధీర్‌, సిరాజుద్దీన్‌, జంగం శాంసన్‌ తదితరులు ఉన్నారు.

➡️