గ్రామీణ బంద్‌ కు సర్వం సిద్ధం

Feb 15,2024 20:49

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు,కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం గ్రామీణ భారత్‌ బంద్‌ చేపట్టేందుకు జిల్లాలో ఉన్న కార్మిక,రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. మరోవైపు కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు వారంతా సమ్మె చేయనున్నారు. బంద్‌, సమ్మెను జయప్రదం చేసదుకు ఇప్పటికే జిల్లాలో అనేక సమావేశాలు పెటి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగించింది. వ్యవసాయం, పరిశ్రమలు గనులు విద్యుత్‌, అటవీ సంపదలను, రవాణా, బ్యాంకులు, ఎల్‌ఐసి తదితర సంస్థలన్నిటినీ అదానీ, అంబానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తోంది. కార్పొరేట్‌ కంపెనీల లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్లు తెచ్చింది. రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించినా జీవోలు ఇవ్వకపోగా, మరో రూపంలో వాటిని అమలుపరచేందుకు చూస్తోంది. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు పెట్టింది. కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్యవసర వస్తువులన్నింటిపైనా జిఎస్‌టి పేరిట పన్నులు పెంచి అన్ని రకాల ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారాలు వేసింది. గత పదేళ్లలో బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు లక్షా యాభైవేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి మరింత ద్రోహం చేసింది. ప్రత్యేక హోదాను నిరాకరించింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడం లేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితులు నష్టపరిహారం, పురావాసం తనకు సంబంధం లేదంటుంది. రైల్వే జోన్‌ ఎగనామం పెట్టింది. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. రాజధాని నిర్మాణానికి పట్టెడు మట్టితో సరిపెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తోంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుంది. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రైతు, కార్మిక ప్రజా అనుకూల విధానాలకై పోరాడాలని, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చాలు పిలుపు ఇచ్చాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా గ్రామీణబంద్‌ నిర్వహించాలని, పరిశ్రమల అన్నింటిలో కార్మిక సమ్మె జరపాలని నిర్ణయించాయి. అన్ని రైతు , కార్మిక సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్లు, వినియోగదారుల సంఘాలు, వృత్తి సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా, సాంస్కతిక సంఘాలు గ్రామీణ బంద్‌ను, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చాయి.

ఇవీ డిమాండ్లు

– స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలి. రైతు రుణాలు మాఫీ చేయాలి.

– నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలి

– ఉపాధిహామీకి కేంద్ర బడ్జెట్లో రూ. 2లక్షల కోట్లు కేటాయించి, 200 రోజులకు పెంచాలి. వేతనం రూ.600కు పెంచాలి. 2 పూటల పని, ఆన్‌లైన్‌ మస్తర్‌ రద్దు చేయాలి.

– ఆహార భద్రత చట్టాన్ని పటిష్ఠ పరచాలి.

– విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి- విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలి, స్మార్ట్‌ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలి. – భూహక్కుల చట్టం 27/23 ను ఉపసంహరించాలి.

-చుక్కలభూములు, బంజరు భూములన్నిటికి పట్టాలు ఇవ్వాలి. – రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్ర పంటల భీమా పథకం పెట్టాలి. సాగులో ఉన్న కౌలు రైతులకే నష్టపరిహారాలు, బీమా సౌకర్యం ఇవ్వాలి.

– అటవీ హక్కుల చట్టం సవరణలు ఉపసంహరించాలి. ఆదివాసుల హక్కులను కాపాడాలని.

– బంద్‌లో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో కోట జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన,కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో ఉన్న రైతు సంఘాలు,కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్‌ లో కర్షకులు,కార్మికులు పాల్గొననున్నారు.

➡️