గ్రామీణ బంద్‌ జయప్రదం కోసం ప్రచారం

Feb 13,2024 23:25

ప్రజాశక్తి-ముప్పాళ్ల : దేశవ్యాప్తంగా 16న జరిగే గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు మండల కేంద్రమైన ముప్పాళ్లలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రైతుసంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలనూ విస్మరించిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతోందని, కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఈ అంశాలతోపాటు ఉపాధి హామీ చట్టానికి నిధులు చాలని, ఏడాదికి 200 పని దినాలు కల్పించి రూ.600 దినసరి కూలివ్వాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి పంటలకు మద్దతు ధరలివ్వాలన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును నిలిపేయాలని కోరారు. ఈ అంశాలపై చేపట్టే బంద్‌లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు జి.జాలయ్య, ఎన్‌.సాంబశివరావు, టి.అమరలింగేశ్వరరావు, పి.సైదాఖాన్‌, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : బంద్‌ జయప్రదం కోసం ఎఐటియుసి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్‌ మాట్లాడారు. బి.శ్రీనివాసరావు, యు.రాము, సిపిఎం నాయకులు బి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు మునివెంకటేశ్వర్లు, ఎఐసిసిటియు నాయకులు జి.ఫిరోజ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ ఎలాంటి భద్రతలేని స్థితిలో వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారని, పనుల్లేక కుటుంబాలు గడవడం కష్టమవుతోందని చెప్పారు. ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయడంతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని కోరారు. పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. టి.శ్రీనివాసరావు, కె.చిన్నమ్మాయి, వాణి, మేరమ్మ, నరసమ్మ, రత్నకుమారి, వాణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

➡️