చర్చలు సఫలం

Jan 23,2024 21:03

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన జిల్లాలో 42 రోజుల పాటు అంగన్‌వాడీలు నిర్విరామంగా వివిధ రూపాల్లో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళ వారంతో ముగిసింది. అలుపెరగకుండా నిరవధిక సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలకు సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అభినందనలు తెలిపింది. 42 రోజుల పాటు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన కొనసాగి, రాష్ట్ర చరిత్రలోనేనీ పోరాటం నిలిచింది. సిఎం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే నినాదంతో కొనసాగిన ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు, ఎస్మా, ఇలా అనేక పద్ధతులను ఉపయోగించింది. ఐసిడిఎస్‌ అధికారులను, పోలీసులను ఉసిగొల్పింది. ఆఖరుకు ఉద్యోగాల నుండి తొలగింపు వరకు తీసుకొచ్చింది. అయినా అంగన్‌వాడీలు అదరక బెదరక పోరాటాన్ని కొనసాగించారు. ఈ పోరానికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అంగన్వాడీల అమరావతి ముట్టడిని చూసిన ప్రభుత్వం సోమ వారం రాత్రి హుటాహుటిన యూనియన్‌ నాయకు లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళ వారం నుంచి సమ్మె విరమించి, అంగన్వాడీలంతా తమ తమ కేంద్రాలకు వెళ్లి విధుల్లో పాల్గొన్నారు.అంగన్‌వాడీల విజయోత్సవ ర్యాలీసాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 42రోజుల పాటు సమ్మె చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మంగళవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు డిమాండ్ల పరిష్కారం కోసం అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని పోరాడి విజయం సాధించిన నేపథ్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి బోసుబొమ్మ జంక్షన్‌ ర్యాలీ చేపట్టారు. అనంతరం బోసుబొమ్మ జంక్షన్‌లో కేక్‌ కట్‌ చేసిన యూనియన్‌ నాయకులు నారాయణమ్మ, శశికళ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు కార్యకర్తలకు పంపిణీ చేశారు. పోరాటంలో కడదాకా నిలబడిన అంగన్వాడీ కార్యకర్తలు. హెల్పర్లందరికీ ధన్యవాదాలని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కుమారి, జానకీ, శాంతి, తిరుపతమ్మ, ఉత్తరమ్మ, మరియమ్మ, సుజాత, చిలకమ్మ, రాధ, ఈశ్వరమ్మ, పద్మ పాల్గొన్నారు.సీతంపేట : అలుపెరగకుండా నిరవధిక సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీతంపేట ప్రాజెక్ట్‌ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అభినందనలు తెలిపిన వారిలో సిఐటియు జిల్లా కమిటీ సీనియర్‌ నాయకులు ఎ.భాస్కరరావు, మండల అధ్యక్ష కార్యదర్శి ఎస్‌.సురేష్‌, ఎం.కాంతారావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీతంపేట ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు బి.పార్వతి, ఎ.దర్శిమి, తదితరులు ఉన్నారు.

➡️