చింతలవలసలో దొంగల బీభత్సం

Mar 22,2024 21:15

 ప్రజాశక్తి -డెంకాడ  : జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రామభద్రపురం, భోగాపురంతోపాటు డెంకాడ మండలంలోని చింతవలస, ఐదో బెటాలియన్‌ ఎదురుగా ఉన్న సత్యనారాయణపురంలో మూడు రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి మండలంలో చింతలవలస గ్రామంలో ఎవరూ లేని ఇంట్లో దొంగలు చొరబడి ఇంటిని చిందరవందర చేశారు. చింతలవలసలో బి.జగన్మోహనరావు అనే ఉద్యోగ విరమణ పొంది, గ్రామంలో ఇల్లు నిర్మించుకొని తన భార్యతో జీవిస్తున్నాడు. వారి కుమారుడు హైదరాబాద్‌లో ఉండడంతో భార్య అక్కడికి వెళ్లి, అక్కడే మరణించింది. దీంతో జగన్మోహనరావు హైదరాబాద్‌ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు డోర్‌కు మిషన్‌ ద్వారా రంధ్రాలు వేసి, తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు ఇంట్లో ఉన్న మూడు బెడ్‌ రూముల్లో కబోర్డులు, బీరువాల్లోని దుస్తులు, సామగ్రిని చిందరవందరగా పారేశారు. ఏమీ దొరక్క పోవడంతో బయటకు వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న వారు ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండటంంతో విశాఖలో ఉంటున్న జగన్మోహన్‌రావు కుమార్తెకు సమాచారం అందించారు. దీంతో అల్లుడు శ్రీనివాస్‌ కుమార్‌ ఇంటికి చేరుకున్నాడు. మామయ్య జగన్మోహన్‌ రావుకు సమాచారం ఇచ్చాడు. ఇంట్లో ఎటువంటి నగదు, బంగారం చోరీ కాలేదని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఆధారాలను సేకరించారు డెంకాడ ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️