చిత్తూరులో దిగ్గజాల మధ్య పోటీ

Feb 24,2024 22:04

చిత్తూరులో దిగ్గజాల మధ్య పోటీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఇద్దరు దిగ్గజాల మధ్య పోటీ నెలకొంది. చిత్తూరు నియోజకవర్గంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజివర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహిస్తున్నారు. మరోమారు ఎమ్మెల్యే సీటు కోసం ఆరని ప్రయత్నాలు ముమ్మరంగా సాగించారు. అయినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయానందరెడ్డిని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. విజయానంద రెడ్డి చిత్తూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే తనసొంత నిధులు కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో పలు రకాల సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా నియోజకవర్గంలో సమవుజ్జి అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త, జీజేయం ట్రస్ట్‌ చైర్మన్‌ గురజాల జగన్మోహన్‌ను ఆచితూచి టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ అధిష్టానం శనివారం ప్రకటించింది. గురజాల జగన్మోహన్‌ కూడా గత కొంతకాలంగా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి పలు రకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా రాజకీయాలకతీతంగా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డి, టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌లో ఆర్థిక బలం కలిగి ఉండడంతో నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా సాగనుంది. ప్రతిపక్షం టిడిపి తరపున పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినప్పటికీ అధిష్టానం గురజాల జగన్మోహన్‌ వైపు మొగ్గుచూపుతూ ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేసింది. దీనితో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు జిల్లాలోని ప్రత్యేకంగా నిలువనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో, జయోపజయాలు ఎవరిని వరిస్తాయో వేచి చూడాలి..

➡️