జగనన్నతోనే సామాజిక సాధికారత

ప్రజాశక్తి -కనిగిరి : జగనన్నతోనే సామాజిక సాధికారత సాధ్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కనిగిరి ఎఎంసి పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో ముఖఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన చంద్రబాబును నమ్మవద్దని తెలిపారు. సీట్లు మార్పు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. సొంత నియోజకవర్గాలను వదిలి చంద్రబాబు కుప్పంలో, బాలకష్ణ హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎల్లో మీడియా టిడిపిని అధికారంలో కూర్చోబెట్టి దోచుకోవాలని చూస్తుందని విమర్శించారు. వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛారిగా తనను నియమించడం పట్ల కూడా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కొండపి ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నారు. బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను వచ్చే ఎన్నికల్లో ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.అనంతరం ఎఎంసి చైర్మన్‌ చింతగుంట్ల సాల్మన్‌ రాజు, పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. తొలుత సిఎం జగన్‌ జన్మదినం , సెమీ క్రిస్మస్‌ వేడుకులు నిర్వహించి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ను ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌, వైసిపి శ్రేణులు సత్కరించారు. అనంతరం పాస్టర్ల దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వైస్‌ చైర్మన్‌ పులి శాంతి, ఎంపిపి గాయం సావిత్రి, దంతులూరి ప్రకాశం, మూడమంచు వెంకటేశ్వర్లు, జఫన్య, నాయకులు తమ్మినేని సుజాత రెడ్డి, సంగు సుబ్బారెడ్డి, డాక్టర్‌ పెరుగు మురళీకష్ణ, ఓకేరెడ్డి, దేవకీ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసులు, బుజ్జి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

➡️