జగన్‌రెడ్డి పేదల ద్రోహి : డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి -కనిగిరి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గహనిర్మాణాలకు కేంద్ర నిధులతోనే సరిపెట్టి రాష్ట్ర నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పేదలను అప్పుల ఊబిలోకి నెట్టారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. స్థానిక అమరావతి గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ఉగ్ర మాట్లాడారు. గహ నిర్మాణలకు కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర నిధుల నుంచి లక్ష రూపాయలు వంతున గతంలో చంద్రబాబు నాయుడు మంజూరు చేసినట్లు తెలిపారు. 58 నెలల పాలనలో 14 లక్షల ఎకరాల అసైన్మెంట్‌ భూములు కబ్జా చేసిన జగన్‌ ముఠా పేదల ద్రోహులు కాదా అని ఆయన ప్రశ్నించారు. దళిత, బడుగు వర్గాల కోసం చంద్రబాబు భూమి కొనుగోలు పథకం పెట్టి 5 వేల ఎకరాలు ఇస్తే జగన్‌ ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. గహ నిర్మాణానికి చంద్రబాబు 2 సెంట్లు చొప్పున వంతను ఇస్తే జగన్‌ సెంటుకు కుదించారన్నారు. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.చంద్రబాబు 2.60 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని లబ్దిదారులకు ఇవ్వకుండా ఎన్నికలు వచ్చేసరికి ఇళ్ల పట్టాల పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పేదలకు రెండు సెంట్ల చొప్పున పట్టాలు ఇస్తారాన్నారు. టిడిపి ఐదేళ్ల పాలనలో 12 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందజేసినట్లు తెలిపారు. జగన్‌రెడ్డి 25 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. కేవలం 5 లక్షల ఇళ్లే నిర్మించినట్లు తెలిపారు. గహనిర్మాణం పేరుతో పేదలను అప్పులపాలు చేశారన్నారు ఎన్‌టిఆర్‌, చంద్రబాబు గతంలో ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు ఒటిఎస్‌ పేరుతో బలవంతంగా ఒక్కొక్కరు నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేశారని విమర్శించారు. రాజధాని అమరావతి పరిధిలో 29 గ్రామాల్లో దళితులు, బీసీలు, మైనారిటీలు 80 శాతంపైగా ఉన్నారన్నారు. వారి భూముల్లోకి బయట గ్రామాల వారిని తెచ్చి స్థానికులు, వారి మధ్య రచ్చ పెట్టిన పేదల ద్రోహీ జగన్‌ అని విమర్శించారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తమ్మనేని శ్రీనివాసులురెడ్డి, మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్‌ పి. శ్రీనివాసులురెడ్డి, నాయకులు వివిఆర్‌. మనోహర రావు, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, తమ్మనేని వెంకటరెడ్డి, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకల వెంకటేశ్వర రెడ్డి, బుల్లా బాలబాబు, జంషేర్‌ అహ్మద్‌, గాయం తిరుపతిరెడ్డి, షరీఫ్‌, ఈదర రవికుమార్‌ కాసుల శ్రీరాములు యాదవ్‌, ఓబులురెడ్డి, గుడిపాటి ఖాదర్‌, సుభాని, ఆచాల రవి, అహ్మద్‌, గండికోట రమేష్‌, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️