జగన్‌ పాలనలో చీకటి రోజులు

Dec 2,2023 20:32

ప్రజాశక్తి- మెంటాడ  :  రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు జగన్‌ పాలనలో చీకటి రోజులు దాపురించాయని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి ఆవేదన వ్యక్తంచేశారు. సర్పంచులు, ఎంపిటిసి సభ్యులను బిచ్చగాళ్లుగా మార్చిన ఈ సర్కారును సాగనంపాలని పిలుపునిచ్చారు. శనివారం మెంటాడలో జరిగిన ప్రస్తుత, మాజీ పంచాయతీ రాజ్‌ ప్రతినిధుల నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికలకు ముందు బూటకపు హామీలతో భ్రమలు కల్పించి, అధికారంలోకి వచ్చాక పంచాయతీలను ఉత్సవ విగ్రహాల్లా మార్చారని ధ్వజమెత్తారు. విధులు, నిధులు లేక సర్పంచులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు పార్టీలకు అతీతంగా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామాల్లో వాలంటీర్లకు దక్కుతున్న గౌరవం కూడా సర్పంచులకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పిఆర్‌ వ్యవస్థను సర్వనాశనం చేశారని విమర్శించారు. ఇదే తీరు కొనసాగితే మున్ముందు ప్రజాప్రతినిధులు మరింత చులకన అవుతారని తెలిపారు. పంచాయతీ రాజ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌, టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకటరావు, టిడిపి నాయకులు జి.ముసలి నాయుడు, రెడ్డి ఎర్రినాయుడు, ఆర్‌.రవిశంకర్‌, రెడ్డి ఆదినారాయణ, కుంచు వెంకట్‌, రెడ్డి సత్యనారాయణ, రెడ్డి ఇందిర, చిన్నంనాయుడు, జి.ప్రవీణ్‌, రామలింగేశ్వరరావు, కాశీవిశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.

➡️