జనవరి నుంచి రెండో దఫా ఆరోగ్య సురక్ష

Dec 17,2023 21:04

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  2024 జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 నుంచి ఇంటింటా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో రూపొందించిన బ్రోచర్‌ను 18వ తేదీన సిఎం జగన్మోహన్‌రెడ్డి దూర దృశ్య కార్యక్రమం ద్వారా ఆవిష్కరించనున్నారు. రెండోవిడత ఆరోగ్య సురక్షకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. ఈ సారి గ్రామ స్థాయిలో కాకుండా మండల కేంద్రాలు, పక్కపక్క గ్రామాలకు అందుబాటులో ఉండే ఊళ్లల్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మండలం యూనిట్‌గా నెలలో నాలుగు శిబిరాలు చొప్పున ఆరు నెలల పాటు నిర్వహించేందుకు ప్రణాళి రూపకల్పన జరుగుతోంది. ఇవి కూడా మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. తొలి దఫా నిర్వహించిన జగనన్న శిబిరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50లక్షల మందికి స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, అంతకు మించిన సంఖ్యలో వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించినట్టుగా అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో తొలి విడత నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో 2,53,679 మందికి స్కీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. వీరందరికీ కలిపి 2,90,000 ఆరోగ్య పరీక్షలు చేశారు. మొత్తంగా 8,541 మందిని వివిధ ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. వీరిలో 3,954 మంది కేటరాక్టు, మిగిలినవారు ఇతర వ్యాధులతోనూ బాధపడుతున్నారు. రిఫర్‌ చేసిన కేసుల్లో ఇప్పటి వరకు 1185 కేసులు ఆసుపత్రులకు వెళ్లాయి. 173మంది ఆసుపత్రుల్లో జాయిన్‌ అయ్యారు. వీరిలో 157మందికి సర్జరీలు చేయించుకున్నట్టు సమాచారం. 151 మంది ఇప్పటికే ఇళ్లకు చేరారు. ఆసుపత్రులకు రానుపోను ఛార్జీలు, ఇతర ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్‌ చేసి ఆసుపత్రి సేవలు, గుండె, ఊపరితిత్తులు, కంటి తదితర సర్జరీలు చేసినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సురక్ష శిబిరాలకు వచ్చినవారిలో ఎక్కువ మందికి బిపి, సుగర్‌, కంటి చూపు సమస్యలతో ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఆరోగ్య శ్రీ సమాచారం తెలుసుకోవడంతోపాటు సంబంధిత ఆసుపత్రుల్లోని ఆరోగ్య మిత్రలను ఇంటినుంచే సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను, కరపత్రాన్ని రూపొందిం చింది. ఆరోగ్య శ్రీ కొత్తకార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వీటిని ఈనెల 18న సిఎం జగన్మోహన్‌రెడ్డి లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంతోపాటు సిహెచ్‌సిలు, పిహెచ్‌సిల్లో కూడా దూర దృశ్య కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌, వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. 20వ తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ పెట్టించడంతోపాటు ఆపరేటింగ్‌ గురించి వివరించనున్నారు. తద్వారా వివిధ జబ్బులకు సంబంధించిన నెట్‌ వర్కు ఆసుపత్రులను గుర్తించడంతోపాటు సంబంధిత ఆసుపత్రుల్లోని ఆరోగ్య మిత్రను నేరుగా ఫోన్‌లో సంప్రదించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఖచ్చితమైన సమాచారంతో రోగులు ధైర్యంగా ఆసుపత్రులకు వెళ్లవచ్చని, సమయం ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. దీనికితోడు ఆరోగ్య శ్రీ కార్డుదారులు ఆయా ఆసుపత్రుల్లో పొందాల్సిన సదుపాయాలు, హక్కుల గురించి కూడా ఇంటి నుంచే తెలుసు కోవచ్చనేది ప్రభుత్వ భావనగా ఉంది.

➡️