జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి

ప్రజాశక్తి-మార్కాపురం: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిఎం జగన్‌ సభలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధి కృష్ణపై జరిగిన దాడి హేయమని, అలాంటి ఘటనలు పునరావృతం కారాదని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాప్తాడు ఘటనను నిరసిస్తూ సోమవారం నాడు మార్కాపురంలో ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనాకు వినతిపత్రం అందించారు. నిందితులను శిక్షించాలని కోరారు. ఎపియుడబ్లుజె నాయకులు ఎన్‌వి రమణ, మహబూబ్‌ సుభాని, బాజీవలి, అబ్దుల్‌ రజాక్‌ (బాబు), వి రాజు, సయ్యద్‌ షాకీర్‌ హుస్సేన్‌, మల్లిఖార్జునరెడ్డి, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, ప్రెస్‌క్లబ్‌ జాయింట్‌ సెక్రటరీ బి సురేష్‌, రాజ్‌ కమల్‌, సుబ్బారావు, అన్వర్‌, అంకయ్య పాల్గొన్నారు. పొదిలి: ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి సభలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా పొదిలిలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులు ర్యాలీ నిర్వహించారు. విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ తహశీల్దారు మహమ్మద్‌ జియా ఉల్‌ హుక్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లురెడ్డిలకు వినతిపత్రం అందించారు. అనంతరం పొదిలి పెద్ద బస్టాండ్‌ సెంటర్‌ లో జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తూ, దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

➡️