జాతీయ రహదారి విస్తరణ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని రాస్తారోకో

రాస్తారోకో చేస్తున్న జడ్డంగి గ్రామస్తులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

జాతీయ రహదారి 516ఇ విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా గృహాలు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ గురువారం జడ్డంగి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌ వాహనాలను సుమారు రెండు గంటల బాటు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి వడుగుల జ్యోతి, జడ్డంగి సర్పంచ్‌ కొంగర మురళీకృష్ణ, సొసైటీ చైర్మన్‌ సింగిరెడ్డి రామకృష్ణ, సొసైటీ మాజీ చైర్మన్‌ గణజాల తాతారావు మాట్లాడుతూ జాతీయ రహదారి బాధితులకు నష్టపరిహారం 45రోజుల్లో చెల్లిస్తామని 2023 జూన్‌ 30న చెప్పారని, 8నెలలు కావస్తున్నా నేటికి చెల్లించకపోవడం అన్యాయమన్నారు. తక్షణం బాధితులకు డబ్బులు చెల్లించాని, రోడ్డు విస్తరణలో తొలగించిన తాగునీటి బోర్లు, వాటర్‌ పైప్‌ లైన్‌లు వెంటనే పునరుద్దరించాలని, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న వీధి రోడ్డులకు అప్రోచ్‌ రోడ్‌లు వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన విరమించబోమని భీష్మించారు. విషయం తెలుసుకున్న రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ తన కార్యాలయ సిబ్బందిని బాధితులతో మాట్లాడమని పంపించారు. స్థానిక తాహశీల్దార్‌ డివి సత్యనారాయణ, డిప్యూటీ తాహశీల్దార్‌ అల్లు సత్యనారాయణ, జడ్డంగి ఎస్‌ఐ రఘునాధరావు సమక్షంలో ఆందోళనకారులతో చర్చించి, 20 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తమని లిఖిత పూర్వక హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యులు అడపా కామేష్‌, గ్రామస్తులు తెడ్ల అబ్బాయి, గంగాధర్‌, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️